ఐపీఎస్‌పై దాడి.. కేంద్రమంత్రిపై ఎఫ్‌ఐఆర్‌!

29 Mar, 2018 20:18 IST|Sakshi

కోల్‌కతా: 144 సెక్షన్‌ను ఉల్లంఘించి.. ఐపీఎస్‌ అధికారిపై దాడి చేశారంటూ కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోపై పశ్చిమ బెంగాల్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. శ్రీరామనవమి సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగిన అసన్‌సోల్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొనడంతో పోలీసులు 144 సెక్షన్‌ విధించి.. నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చారు. అయితే, తన నియోజకవర్గం పరిధిలోని అసన్‌సోల్‌ పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడ పర్యటించాలని కేంద్రమంత్రి బాబుల్‌ ప్రయత్నించారు.

ఇందుకు భద్రతా సిబ్బంది అడ్డుపడటంతో మరో మార్గం ద్వారా కల్యాణ్‌పూర్‌ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో ఆగ్రహానికి లోనైన బాబుల్‌ ఐపీఎస్‌ అధికారి రూపేశ్‌ కుమార్‌పై దాడిచేసినట్టు తెలుస్తోంది. దీంతో 144 సెక్షన్‌ను ఉల్లంఘించి.. విధినిర్వహణలో ఉన్న ఐపీఎస్‌పై దాడి చేశారని, అల్లర్లకు పాల్పడ్డారని పోలీసులు కేంద్రమంత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అసన్‌సోల్‌లో పర్యటిస్తున్న సమయంలో పోలీసులే తనపై దాడి చేశారని, దీనిపై తాను కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు