‘అవినీతి, నయవంచక నేతల ర్యాలీ అది’

19 Jan, 2019 15:08 IST|Sakshi

బీజేపీ నేత, కేంద్ర 'సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో

న్యూఢిల్లీ : బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. సుమారు 20 పార్టీలకు చెందిన నాయకులు ‘యునైటెడ్‌ ఇండియా బ్రిగేడ్‌’ ర్యాలీకి హాజరై ప్రసంగించారు. ఈ క్రమంలో బీజేపీ నేత, కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో మమతా బెనర్జీ, సభకు హాజరైన నాయకులను ఉద్దేశించి సోషల్‌ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.

ఈ ర్యాలీ కోసం భారీగా ఖర్చుపెట్టారు!
‘అది అవినీతి నేతల ర్యాలీ. ఇంతటి నయవంచక రోజు కోల్‌కతా వేదికగా నిలిచింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు పెట్టుకున్న అపవిత్ర పొత్తుకు ఇది నిదర్శనం. #బ్రిగేడ్‌ఛలో అని నినదించేందుకు బదులుగా భారత్‌ను గొప్పగా తీర్చిదిద్దుతాం అని అంటే బాగుండేది. ప్రజల బాగు కోసం తీసుకునే నిర్ణయాల గురించి చర్చించడం ఉత్తమం కదా. ఈ ర్యాలీ కోసం భారీగా ఖర్చు పెట్టిన టీఎంసీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మాత్రం ఏమాత్రం ఖర్చు పెట్టదు. నయవంచక సభకు కోల్‌కతా సాక్ష్యంగా నిలిచింది. సభ వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పేద ప్రజలను టీఎంసీ వేధింపులకు గురిచేస్తోంది’ అంటూ బాబుల్‌ సుప్రియో వరుస ట్వీట్లు చేశారు.

మరిన్ని వార్తలు