బాలయ్య చెబితే ఓకే!

20 Mar, 2018 09:37 IST|Sakshi

హిందూపురం రోడ్డు విస్తరణ పనుల్లో తనదైన మార్కు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: హిందూపురం నియోజకవర్గంలో రోడ్డు విస్తరణ పనుల్లో బాలయ్య తన నిజ స్వరూపం చూపించారు. తనకు తెలియకుండా.. తన అనుమతి లేకుండా ఎవరూ టెండర్లు వేయకూడదని, వేస్తే పనులు చేయలేరని బెదిరించినట్లు తెలుస్తోంది. బాలయ్యతో పెట్టుకుంటే పనులు చేయలేమని గ్రహించిన నిర్మాణ సంస్థలు టెండర్లు వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో టెండర్లు భారీ ధరకు బాలయ్య అస్మదీయ ఏజెన్సీలు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొడికొండ, హిందూపురం, మడకశిర పరిధిలో జాతీయ రహదారి విస్తరణకు 60 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులకు రూ.363 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ లెక్కన ఒక కిలోమీటరుకు రూ.6కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ రోడ్డు ఏడు మీటర్ల వెడల్పు ఉంది. దీన్ని 10 మీటర్ల వెడల్పునకు పెంచాలి. అంటే రోడ్డుకు ఇరువైపులా 1.5 మీటర్ల వెడల్పు పెరుగుతుంది. సాధారణంగా ఈ పనులకు రూ.2 నుంచి రూ.3కోట్లు మాత్రమే ప్రతిపాదిస్తారు.

కానీ, ఈ రోడ్డుకు ఏకంగా కిలోమీటరుకు రూ.6కోట్లు ప్రతిపాదించడం చూస్తే రోడ్డు విస్తరణ పేరుతో ఏ స్థాయి దోపిడీకి ప్రభుత్వం తెరలేపిందో అర్థమవుతోంది. కేవలం బాలయ్యకు భారీగా నిధులు కట్టబెట్టడం కోసమే ఈ అంచనాలు పెంచారని తెలుస్తోంది. అంచనాలు పెంచి భారీ మొత్తాన్ని అధికారులు ప్రతిపాదించేలా ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పినట్లు చర్చ జరుగుతోంది. ఈ టెండర్లలో ఎవరూ పోటీకి రాకుండా స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ అడ్డుచెప్పినట్లు సమాచారం. బాలయ్య ఆశీస్సులతో ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్సన్, ఆర్‌.యం.ఎన్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో కూడా ఆర్‌.యం.ఎన్‌ ఇన్‌ఫ్రా నామమాత్రంగానే టెండర్‌ కోట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఎస్‌.ఆర్‌. కన్‌స్ట్రక్సన్స్‌కు పనులు దక్కేలా బాలయ్య చక్రం తిప్పినట్లు సమాచారం. స్వేచ్ఛగా ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించి ఉంటే దాదాపు అంచనా వ్యయం కంటే 20 శాతం తక్కువకు టెండర్లు కోట్‌ చేసేవాళ్లు. కానీ, ఎవరూ పోటీ లేకుండా అస్మదీయులకు టెండర్లు దక్కేలా చేయడంతో  పనుల్లో దాదాపు రూ.70కోట్లు ప్రభుత్వానికి నష్టం చేకూరినట్లయింది.

మరిన్ని వార్తలు