ఆంధ్రాకు రా, చూసుకుంటా

4 Dec, 2018 06:15 IST|Sakshi
రోడ్‌షోలో అభివాదం చేస్తున్న బాలకృష్ణ

హైదరాబాద్‌: ‘కేటీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు రా.. చూసుకుంటా. నా తడాఖా ఏంటో చూపిస్తా. తెలంగాణలోనే ఏం చేయలేనివాడివి, ఏపీలో పెత్తనం చేస్తావా. ఏపీలో కాలు మోపడం కాదు కదా, వేలు కూడా పెట్టలేవు’ అని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ను ఉద్దేశించి సవాల్‌ విసిరారు. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం దృష్ట్యా తాము ఏపీలో జోక్యం చేసుకుంటామంటూ ఇటీవల కేటీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మలక్‌పేట్‌ నియోజకవర్గంలోని సైదాబాద్‌లో ప్రజాఫ్రంట్‌ అభ్యర్థి ముజఫర్‌ అలీఖాన్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఆంధ్రలో అడుగు కూడా పెట్టలేవంటూ కేటీఆర్‌ను హెచ్చరిం చారు. తనకు మీసం లేకపోయినా మీసం మెలిపెడుతున్నట్టు ఫోజుపెట్టి, తొడగొట్టి మరీ సవాల్‌ విసిరా రు.

తెలంగాణలో గడీల రాజ్యాన్ని కూల్చి గరిబోళ్ల రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ప్రజాఫ్రంట్‌ అధికారం లోకి వస్తే నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఎందరో యువకుల బలిదానాలు, త్యాగాలతో తెలంగాణ వచ్చిందని, కానీ అమరుల కుటుం బాలకు న్యాయం జరగలేదన్నారు. ప్రజా ఫ్రంట్‌ అధికారంలోకి వస్తే నగరంలో అమరవీరుల స్థూపాన్ని నిర్మిస్తామని చెప్పారు. నగరంలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని చరిత్ర మరిచిపోదన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో టీఆర్‌ఎస్‌ పాత్ర శూన్యమన్నారు. ‘నేనూ హైదరాబాదీనే. ఎవరి రక్తానికి మతం, కులం ఉండదు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బొల్లు కిషన్, కొత్తకాపు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు