దిమాక్‌ థోడా.. చాలా తేడా!

20 Mar, 2019 09:11 IST|Sakshi

ఒక్క ‘జన్మభూమి’కీ హాజరుకాని ఏకైక ఎమ్మెల్యే బాలయ్య 

అతిథిలా ఏటా రెండుమూడు సార్లే రాక 

సామాన్యులకు దర్శన భాగ్యం దుర్లభమే

పీఏలు చెప్పిందే వేదం.. అంతా ఇష్టారాజ్యం

రాష్ట్రంలోని ఎమ్మెల్యేలలో 174 మంది ఒక ఎత్తు.. నందమూరి బాలకృష్ణ ఒక ఎత్తు! అన్ని నియోజక వర్గాలది ఒక తీరు... హిందూపురం మరో తీరు! హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ‘పైసా వసూల్‌’ సినిమాలో చెప్పినట్లుగానే ‘దిమాక్‌ థోడా.. చాలా తేడా!’ తరహాలో వ్యవహరిస్తారనే విమర్శలున్నాయి. ఆయనకు నియోజకవర్గంతో పనిలేదు. ప్రజల బాగోగుల సంగతి సరేసరి. సినిమాలో ‘గెస్ట్‌ ఆర్టిస్ట్‌’లా కేవలం మూడు నిమిషాలు వచ్చి పోయినట్లుగా ఎమ్మెల్యేగా ఐదేళ్లలో ఏటా రెండు మూడుసార్లు మాత్రమే ఆయన హిందూపురానికి వచ్చారు. అదికూడా మూడు రోజులకు మించి ఉండరు. అత్యంత ముఖ్యమైన నేతలు, సన్నిహితులు మినహా టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలకు కనీసం దర్శనం కూడా ఉండదు. పార్టీకి సంబంధించిన ఇబ్బందులైనా, ప్రజా సమస్యలైనా బాలయ్య పీఏలను సంప్రదించాల్సిందే. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం మొదలైంది. పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే గడువు ఉంది. కానీ ఇప్పటివరకు బాలయ్య హిందూపురంలో అడుగుపెట్టకపోవడం గమనార్హం.  

హిందూపురంలో పీఏల సామ్రాజ్యం.. 
బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌ ప్రాతినిథ్యం వహించిన హిందూపురం నుంచి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్‌ కుమారుడు కావడం, తొలిసారి ఎన్నికల బరిలో ఉండటంతో నియోజకవర్గ ఓటర్లు ఆయన్ను ఆదరించి గెలిపించారు. బాలయ్య కుటుంబ సమేతంగా ప్రచారం చేస్తే 16,196 ఓట్లతో విజయం సాధించారు. ఎన్నికల సమయంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కుటుంబ సమేతంగా వచ్చి పాలు పొంగించి గృహ ప్రవేశం చేశారు. ఫలితాలు వెలువడ్డాక ఇంటిల్లిపాది హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయారు. ఆ ఇంటిని పీఏలకు అప్పగించి నియోజకవర్గాన్ని మరిచిపోయారు. చిత్తూరు జిల్లాకు చెందిన బాలయ్య పీఏ శేఖర్‌ ‘షాడో ఎమ్మెల్యే’ మాదిరిగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, చివరకు జన్మభూమి సభలు కూడా అతని ఆధ్వర్యంలోనే నడిచాయి. అధికారులు కూడా శేఖర్‌నే ఎమ్మెల్యేగా భావించి ఆయన ఆదేశాలను పాటించారు. అతను హెచ్చరిస్తే జంకారు. పొగిడితే సంబరపడిపోయారు. ఇలా మూడేళ్ల పాటు శేఖర్‌ హల్‌చల్‌ చేశాడు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తారాస్థాయిలో అవినీతికి పాల్పడ్డాడు. నియోజకవర్గ నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడంతో చివరకు అతడిని తప్పించి గుంటూరు జిల్లా యడ్లపాడుకు చెందిన వీరయ్యను పీఏగా నియమించారు. ఇదే నియోజక వర్గానికి చెందిన తిమ్మాపురం మాజీ సర్పంచ్‌ శ్రీనివాసరావును మరో పీఏగా నియమించారు. చివరి రెండేళ్లు వీరే ఎమ్మెల్యే మాదిరిగా వ్యవహరించారు. బాలకృష్ణ ఈ ఐదేళ్లలో జన్మభూమి కార్యక్రమానికి ఒక్కరోజు కూడా హాజరు కాలేదు. పనితీరు ఆధారంగా టిక్కెట్లు కేటాయించామని చెబుతున్న సీఎం చంద్రబాబు.. మరి ఏ సూత్రాన్ని పాటించి బాలయ్యకు టిక్కెట్‌ కేటాయించారు? అని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు.  

మహిళలపై అసభ్య వ్యాఖ్యలు... 
2016 మార్చిలో ‘సావిత్రి’ ఆడియో ఫంక్షన్‌ సందర్భంగా ఎమ్మెల్యే అనే సంగతి కూడా మరచి మహిళలపై బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడం తెలిసిందే. ‘‘అమ్మాయిల వెంటపడే పాత్రలు నేను చేస్తే ఒప్పు కోరు కదా..! ముద్దయినా పెట్టాలి... లేదా కడుపైనా చేయాలి. అంతే కమిట్‌ అయిపోవాలి... హీరో రోహిత్‌కు మా పోలికలు కొద్దిగా అయినా రావాలి... గిల్లడాలు... పొడవడాలు.. నేను ఎక్కని ఎత్తుల్లేవు... చూడనిలోతుల్లేవు..’’ అంటూ బాలయ్య అసభ్యంగా మాట్లాడటంపై అంతటా విస్మయం వ్యక్తమైంది. బాలయ్య ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, ఆయన ఒక్కక్షణం కూడా ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అర్హుడు కాదని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ వ్యవహారాన్ని స్పీకర్‌ కోడెల దృష్టికి తెచ్చినా ఆయన స్పందించలేదు.  

ఈసారి బాలయ్యకు రిటర్న్‌గిఫ్ట్‌ తప్పదు 
తమను ఏమాత్రం పట్టించుకోని బాలకృష్ణకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చి ఇంటికి పంపుతామని నియోజకవర్గ ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఇక్బాల్‌కు పట్టం కడతామంటున్నారు.
– మొగిలి రవివర్మ సాక్షి ప్రతినిధి, అనంతపురం

మరిన్ని వార్తలు