బాబూ నీ మనవడు చదివేదెక్కడ?

15 Nov, 2019 10:43 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : ‘చంద్రబాబు నాయుడూ నీ మనవడు ఏ స్కూల్‌లో చదువుతున్నాడు? పవన్‌కల్యాణ్‌ నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మీవాళ్లంతా ఇంగ్లిష్‌ మీడియంలో చదవొచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లలకు మాత్రం ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెడితే గగ్గోలు పెడతారా’ అని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వారిరువురిని సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మన బడి నాడు–నేడు కార్యక్రమాన్ని  గురువారం స్థానిక పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెట్టడాన్ని ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తుండటంపట్ల బాలినేని సభావేదికగా ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులంతా బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖకు బడ్జెట్‌లో 33 వేల కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని బాలినేని గుర్తు చేశారు. పేదవాళ్ల పిల్లలు కూడా ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోవాలన్న ఉద్ధేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో దశల వారీగా ఇంగ్లిష్‌ మీడియం అమలు చేస్తున్నట్లు తెలిపారు. పై చదువులు చదవాలంటే ఇంగ్లీష్‌ మీడియం అవసరమని గుర్తించిన ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో దానిని దశలవారీగా అమలు చేస్తున్నారన్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జనరంజకంగా పరిపాలన చేస్తే తాను సినిమాలు చేస్తానని పవన్‌కల్యాణ్‌ ప్రకటించారని, ఆయన సినిమా షూటింగ్‌కు సిద్ధం అవుతున్నారంటే జగన్‌ జనరంజక పాలన అందించినట్లు ఆయన చెప్పకనే చెప్పారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన నాయకులు బకాసురులుగా దోచుకుంటే అప్పుడు పవన్‌కల్యాణ్‌కు కనిపించలేదా అని బాలినేని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఇసుక పాలసపై స్పష్టమైన విధానంతో ఉన్నారని, ఒక్క ఇసుక లారీ కూడా అక్రమంగా బయటకు పోకుండా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా