చంద్రబాబుకు అంత దమ్ముందా?

26 Jan, 2019 13:40 IST|Sakshi
పరిచయ కార్యక్రమ సభలో మాట్లాడుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి

హామీలు నెరవేర్చలేక పోతే రాజీనామా చేస్తారా?

పాలన చేతకాక పథకాలు కాపీ

మాజీ మంత్రి బాలినేని    శ్రీనివాసరెడ్డి ధ్వజం

జగన్నినాదాలతో హోరెత్తిన    దర్శి పట్టణం

కోలాహలంగా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల పరిచయ కార్యక్రమం

పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేస్తామన్న బూచేపల్లి, మద్దిశెట్టి

దర్శి: నవరత్నాలతో సహా ఇచ్చిన హామీలకు తాను కట్టుబడి ఉంటానని, అమలు చేయలేకపోతే రాజీనామా చేస్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగానే స్పష్టంగా ప్రకటించారని, అబద్దపు హామీలతో అందరినీ వంచించే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విధంగా ప్రకటించే దమ్ముందా? అని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు పాలించడం చేతకాక జగన్‌ పథకాలైన ఫించన్, డ్వాక్రా రుణాల మాఫీ వంటి వాటిని కాపీ కొట్టి ఎన్నికల ముందు నెరవేరుస్తానని హమీలు ఇవ్వడం సిగ్గు చేటన్నారు. శుక్రవారం దర్శి పట్టణంలోని తాలూకా క్లబ్‌ సమావేశం హాలులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నాయకుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది.

ముందుగా పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జ్‌ మద్దిశెట్టి వేణుగోపాల్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలు బాలినేని శ్రీనివాసరెడ్డితో కలసి వచ్చి గడియార స్తంభం సెంటర్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేలాది మంది నాయకులు, కార్యకర్తల జగన్నినాదాలతో దర్శి పట్టణం దద్దరిల్లింది. పరిచయ కార్యక్రమ సభలో బాలినేని మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాదికిపైగా కష్టపడి పాదయాత్ర చేశారని అందులో సగం కష్టమైనా పడి ప్రతి కార్యకర్త వైఎస్సార్‌ సీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. తాను ఈసారి పోటీ చేయనని బూచేపల్లి చెప్పడంతో ఆయన అభీష్టం మేరకే దర్శి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌గా, పార్టీ అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్‌ను జగన్‌మోహన్‌రెడ్డి నియమించారన్నారు. అందరూ కలసి అత్యధిక మెజార్టీతో మద్దిశెట్టిని గెలిపించాలని కోరారు.

మద్దిశెట్టిని గెలిపించి తీరుతా
రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యరిగా పోటీ చేస్తున్న మద్దిశెట్టి వేణుగోపాల్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతానని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి చెప్పారు. తనకు వైఎస్సార్‌ సీపీలో టిక్కెట్‌ ఇవ్వలేదన్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. తన తండ్రి అనారోగ్య కారణాల వలన ఏడాదిన్నర క్రితమే తాను ఈసారి పోటీ చేయలేనని, మంచి అభ్యర్ధిని నియమిస్తే గెలుపించి తీసుకొస్తానని తాను చెప్పినట్టు గుర్తుచేశారు.  ఈ నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారని కార్యకర్తలు అందరూ మద్దిశెట్టిని ఆదరించాలని కోరారు. మద్దిశెట్టికి ఓటేస్తే తనకు ఓటేసి నట్లేనన్నారు. మంత్రి శిద్దా రాఘవరావుకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెబుతున్నా.. మద్దిశెట్టిని గెలిపించే బాధ్యత బూచేపల్లి కుటుంబం తీసుకుంటుందన్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయం అని అన్నారు. సాగర్‌ జలాలు విడుదలైనా రైతులకు నీరివ్వకుండా వారిని నట్టేట ముంచిన మీకు మంత్రి పదవి అవసరమా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా నియోజకవర్గంలోని ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు.

అందరినీ కలుపుకుపోతా: మద్దిశెట్టి
జగన్‌మోహన్‌రెడ్డి తనను పోటీ చేయాలని అడిగినప్పుడు శివప్రసాద్‌రెడ్డి తనతో ఉంటేనే పోటీ చేస్తానని తాను స్పష్టంగా చెప్పానని మద్దిశెట్టి వేణుగోపాల్‌ తెలిపారు. తామిద్దరం ఒక మాటపై నిలబడి, కలసి కట్టుగా పని చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని, పార్టీని గెలిపించి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. దర్శిలో బలమైన రెండు సామాజిక వర్గాలు కలసి పోటీ చేస్తున్నాయని ఈ సారి గెలుపు ఇక్కడ ప్రత్యర్ధులు పోటీ చేయాలంటేనే బయపడేలా ఉండాలన్నారు. ఆది నుంచి పార్టీలో ఉన్నవారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మద్దిశెట్టి శ్రీధర్, దర్శి, దొనకొండ, ముండ్లమూరు, మండలాల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, సూదిదేవర అంజయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిలు ఐవీ సుబ్బారెడ్డి, కుమ్మిత అంజిరెడ్డి, పోశం మధుసూదన రెడ్డి, సుంకరబ్రహ్మరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు