రేవంత్‌వి నిరాధార ఆరోపణలు 

8 Jun, 2020 04:31 IST|Sakshi

రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కేటీఆర్‌పై విమర్శలు

ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, కర్నె ప్రభాకర్‌ ప్రెస్‌మీట్‌

సాక్షి, హైదరాబాద్‌: గోపన్‌పల్లిలో దళితుల భూ ములను లాక్కున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ఉద్దేశపూర్వకంగా నిరాధార ఆరోపణ లు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ ఎ.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి ఆదివారం అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎదుటివారిపై బురదచల్లి రాజకీయ పబ్బం గడుపుకోవడం రేవంత్‌కు అలవాటు అని, 111 జీవో పరి«ధిలో ఉన్న వట్టినాగులపల్లి సర్వే నంబర్‌ 66/ ఈలో రేవంత్‌ బావమరిది జయప్రకాశ్‌రెడ్డి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని బాల్క సుమన్‌ ఆరోపించారు. 111 జీవో పరిధిలో ఉన్న ప్రాంతంలో కాం గ్రెస్‌ నేతలకు ఎవరెవరికి భూములు ఉన్నాయో బయట పెడతామన్నారు.

సంచలనాల కోసమే ఆరోపణలు
సంచలనాల కోసమే మాట్లాడే రేవంత్‌రెడ్డి లాంటి నేతలు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమని, ఇలాంటి నాయకులు అవసరమో లేదో జాతీయ పార్టీలు ఆలోచించాలని కర్నె ప్రభాకర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ధర్మానికి కట్టుబడి ఉందని, కోర్టులంటే తమకు గౌరవం ఉందన్నారు. 111 జీవో పరిధిలో అతిపెద్ద భవనాన్ని నిర్మించిన రేవంత్‌ వ్యవహారం దొంగే దొంగ అన్న రీతిలో ఉందన్నారు. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు రేవంత్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నారని, పెయింటర్‌గా జీవితం ప్రారంభించిన ఆయన రూ.వేల కోట్లు ఎలా సంపాదించారో వెల్లడించాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పీసీసీ పదవి కోసమే రేవంత్‌రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నారని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు