కాంగ్రెస్‌కు దూరంగా కార్తీకరెడ్డి! 

24 Mar, 2019 09:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  గ్రేటర్‌ హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బండా కార్తీకరెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు, పార్టీకి దూరం ఉంటున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలో జరుగుతున్న వేళ సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో ఆమె పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటుండటంతో కాంగ్రెస్‌పై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆమె భర్త టీపీసీసీ కార్యదర్శి బండా చంద్రారెడ్డి మూడు దశాబ్దాలుగా, కార్తీకరెడ్డి 15 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో పని చేస్తున్నారు.

అయినా ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోవడంతో ఆమె ప్రస్తుతం మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ఆ సమయంలో ప్రస్తుతం రాష్ట్రంలో అ«ధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినప్పటికీ పార్టీ జాతీయ నాయకత్వం జైరాం రమేష్, కొప్పుల రాజు వంటి నాయకులు స్వయంగా తార్నాకలోని కార్తీకరెడ్డి నివాసానికి వచ్చి కాంగ్రెస్‌ను  వీడవద్దు, భవిష్యత్‌లో అవకాశాలు కల్పిస్తామని బుజ్జగించారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సికింద్రాబాద్‌ నుంచి టికెట్‌ కోసం ఢిల్లీ వెళ్లి విశ్వప్రయత్నాలు చేశారు. అయినా అధిష్టానం అవకాశం కల్పించలేదు. పార్టీ కోసం ఎంతో కష్టపడి ఎక్కడా వెళ్లకుండా సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకుని ఉంటున్న తమకు అవకాశాలు కల్పించకుండా ఏనాడూ పార్టీకి పని చేయని వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశాలు ఇచ్చిందని ఆమె తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమావేశానికి సైతం కార్తీకరెడ్డి హాజరు కాలేదు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్న ఆమె పార్టీకి దూరంగా ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ విషయంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందో వేచి చూడాల్సిందే మరి. 

మరిన్ని వార్తలు