ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

13 Apr, 2018 01:11 IST|Sakshi

ప్రతిపక్షాలపై దత్తాత్రేయ ధ్వజం

హైదరాబాద్‌: పార్లమెంటు సమావేశాలను సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కేంద్ర మాజీమంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిరసనలో భాగంగా గురువారం ఇక్కడ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

అంబేడ్కర్‌ విగ్రహానికి దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ మోదీ అవినీతి రహిత పాలన అందిస్తుంటే, అనేక సంక్షేమ పథకాలతో దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తుంటే సహకరించాల్సిన ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రతి అంశంపై చర్చించడానికి, సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

23 రోజులపాటు పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్ల రూ.200 కోట్ల ప్రజాధనం వృథా అయిందని లక్ష్మణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నగర కార్యదర్శి సలంద్రీ శ్రీనివాస్‌యాదవ్, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, చింత సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు