‘డబుల్‌’ ఇళ్లేవి.. కేంద్రనిధులేవి?: దత్తాత్రేయ

22 Sep, 2018 03:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీని టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకు నెరవేర్చలేదని బీజేపీ నేత, ఎంపీ బం డారు దత్తాత్రేయ ఆరోపించారు. కేంద్ర ప్రభు త్వం తెలంగాణకు అన్ని విధాలుగా సహకరించిందని, ఇళ్ల నిర్మాణం కోసం హడ్కో రుణాలు ఇచ్చినా నిర్మించకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇళ్ల్ల నిర్మా ణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టాయని, అందుకు కారణం మంత్రి కేటీఆరేనని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం, నిధులు పక్కదారి పట్టడంపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు. వచ్చే నెలలో సత్యాగ్రహం చేస్తామని ఆయన చెప్పారు.  

కాంగ్రెస్‌వి ద్వంద్వ విధానాలు..
ఇక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ అని గులాంనబీ ఆజాద్‌ చెప్పడం పచ్చి అబద్ధమని దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ కోసం రాజకీయ తీర్మానం ఆమోదించిన మొదటి పార్టీ బీజేపీయేనని వెల్లడించారు. తెలంగాణ తెచ్చింది తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులేనని స్పష్టం చేశారు.

1969లో తెలంగాణ ఉద్యమకారులను అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పిట్టల్లా కాల్చి 369 మందిని పొట్టనబెట్టుకుందని విమర్శించారు.  ఆనాటి నుంచి తెలంగాణను మోసం చేస్తూనే ఉందన్నారు. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబ సభ్యులంతా సామాన్య జనంతో కలసిపోయారని.. కానీ రాహుల్, సోనియాలే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో జైళ్ల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు