చంద్రబాబుది దివాలాకోరు రాజకీయం : దత్తాత్రేయ

18 Nov, 2018 16:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాని నరేంద్రమోదీని చూడగానే జ్వరం 104కు పోతుందని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. చంద్రబాబుది దివాలాకోరు రాజకీయమని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విషయంలో చంద్రబాబుకు జ్వరం పట్టుకుందని, సీబీఐ అంటే ఆయనకు భయమని పేర్కొన్నారు. చంద్రబాబుకు ముందస్తు భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు తీరు ఆంధ్రప్రదేశ్‌ అంతా నా రాజ్యం అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. బాబుకు నిజాయితీ ఉంటే సీబీఐని స్వాగతించాలన్నారు.  

ఎన్‌టీఆర్‌ సమాధి వద్ద బాబు నివాళులు అర్పిస్తే ఆయన ఆత్మ గోషిస్తూందన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ బీజేపీ ఇప్పటివరకు 93 సీట్లు ప్రకటించింది. అందులో ఒకటి యువ తెలంగాణ పార్టీకి కేటాయించింది. మిగతా సీట్లు ఇవాళ ప్రకటన రావొచ్చు. ఉపాధి హామీ పథకం చక్కగా అమలు అవుతోంది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం కల్పిస్తాం. కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు అందజేస్తాం. రోడ్ యాక్సిడెంట్ల నివారణకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటుచేస్తాం. టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, మిగతా వారంతా అధికారంలోకి రావడానికి తెలంగాణ సెంటిమెంట్ అడ్డుపెట్టుకుంటున్నారు. టీఆర్ఎస్ ఘోరంగా వైఫల్యం చెందింది. 

ఆత్మహత్యలు చేసుకున్న రైతులను కూడా ప్రభుత్వం గుర్తించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ జల యజ్ఞాన్ని ధన యజ్ఞంలాగా మార్చింది. మజ్లీస్‌తో పొత్తుపెట్టుకొని.. కేసీఆర్ ఏ విధంగా మత సామరస్యం తీసుకొస్తారు. కేసీఆర్‌ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తున్నారు. టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీలే ఇప్పటివరకు అమలు చేయలేదు, మళ్లీ కొత్తగా ఇచ్చే హామీలు అమలు చేస్తారని ఎలా నమ్మాలి ?. కోదండరాం కాంగ్రెస్ పార్టీతో ఏ విధంగా కలుస్తారు?. 369 మంది అమరుల చావుకు కారణం అయిన కాంగ్రెస్‌తో కోదండరాం ఏ విధంగా కలుస్తార’’ని ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు