ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అనడం అబద్ధం

3 Nov, 2018 01:46 IST|Sakshi

చంద్రబాబుపై దత్తాత్రేయ ఫైర్‌

సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాను కాంగ్రెస్‌ పార్టీతో కలుస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం పచ్చి అబద్ధమని ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. రాహుల్, చంద్రబాబుల కలయికను ఒక విషాదకర కలయికగా ఆయన అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ న్యాయవాది కిలారు దిలీప్‌ రచించిన పుస్తకాన్ని దత్తాత్రేయ శుక్రవారం ఆయన నివాసం లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రాలో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనడం ఏ రకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ అవుతుందని ప్రశ్నించారు.

ఏ పార్టీనైతే కూకటివేళ్లతో పెకిలించేందుకు దివంగత ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారో ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు జతకట్టి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఇక తెలంగాణలో బీజేపీ నిర్మాణాత్మక శక్తిగా ఎదుగుతుందని దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల మంజూరులో కూడా టీఆర్‌ఎస్‌ నేతలు రూ. 86 కోట్ల భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుస్తుందని తెలిపారు. నవంబర్‌ రెండో వారంలో ప్రధాని ఎన్నికల పర్యటన ఉంటుందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు