రాహుల్‌ పర్యటనపై ప్రభుత్వం నిర్బంధకాండ!

11 Aug, 2018 02:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాష్ట్ర పర్యటనపై నిర్బంధకాండకు పూనుకున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతకానితనానికి ఇది నిదర్శనమని టీపీసీసీ కార్యదర్శి బండారు శ్రీకాంత్‌ ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రానికి వస్తుంటే ముఖ్య అతిథిగా ఆహ్వానించాల్సింది పోయి ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించడమేంటని ప్రశ్నించారు.

ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని రాహుల్‌ను 20 విద్యార్థి సంఘాలు ఆహ్వానిస్తే అడ్డుకోవడం ప్రభుత్వ దురహంకారమేనని అన్నారు. ప్రధాని అభ్యర్థికే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో సామాన్యుల సంగతేంటని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

‘ఇది కేసీఆర్‌ మార్కు ప్రజాస్వామ్యమా?’
సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా వర్సిటీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభకు అనుమతినివ్వకపోవడం కేసీఆర్‌ మార్కు ప్రజాస్వామ్యమా అని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. రాహుల్‌ చొరవతో ఏర్పడ్డ రాష్ట్రంలో ఆయనకిచ్చే గౌరవం ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేశారు.  రాహుల్‌ పర్యటన అంటే కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని శుక్రవారం ఎద్దేవా చేశారు.  

మరిన్ని వార్తలు