స్వయం సేవకుడే.. కమలం సారథి

13 Mar, 2020 08:13 IST|Sakshi
బండి సంజయ్‌

ఆరెస్సెస్‌ కార్యకర్త నుంచి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా

స్వయంశక్తితో ఎదిగిన బండి సంజయ్‌ 

రాజకీయ ప్రస్థానంలో ఒడిదొడుకులు

సాగర్‌జీ తరువాత అధ్యక్షుడిగా రెండో నేత 

సాక్షి, కరీంనగర్‌: నమ్మిన సిద్ధాంతాలే రాజకీయ ఎదుగుదలకు సోపానమయ్యాయి. స్వయం సేవకుడిగా మొదలైన ప్రస్థానం భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. ఉద్యమాల ఖిల్లా కరీంనగర్‌ పట్టణానికి చెందిన బండి సంజయ్‌కుమార్‌కు పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పగ్గాలను అప్పగించింది. విద్యార్థి దశ నుంచే స్వయం సేవకుడిగా పనిచేస్తూ... ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్ని రాజకీయాల్లోకి వచ్చిన సంజయ్‌ అంచెలంచెలుగా ఎదిగారు. ఎందరో రాష్ట్ర నాయకులు పోటీపడినప్పటికీ... ఆర్‌ఎస్‌ఎస్‌ అండతో అరుదైన రాష్ట్ర అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం అంచుల వరకు వెళ్లి ఓటమి పాలైనా... మొక్కవోని ధైర్యంతో, నమ్ముకున్న సిద్ధాంతంతోనే పోరాడి పార్లమెంటు సభ్యుడిగా ప్రజల ఆశీర్వాదం పొందారు. పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్న ఆయనకు తాను నమ్మిన ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలే రాష్ట్ర అధ్యక్షుడి హోదాను కట్టబెట్టాయి. 

స్వయం సేవకుడిగా ఎదిగి... 
రాజకీయ కుటుంబం కాకపోయినా పలకా బలపం పట్టిన నాటి నుంచే ఆరెస్సెస్‌ సిద్ధాంతాల వైపు ఆకర్షితుడైన సంజయ్‌ అదేబాటలో పయనించారు. అక్షరాలు దిద్దిన శ్రీసరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో హిందుత్వ భావజాలాన్ని ఒంటబట్టించుకున్నాడు. హిందుత్వ ఎజెండానే నమ్ముకొని బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో సేవకుడిగా పనిచేశాడు. విద్యార్థి దశలోనే స్వయం సేవక్‌ శిక్షక్‌గా ఎదిగాడు. కాలేజీ విద్యార్థిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ)లో చేరిన ఆయన పట్టణ కన్వీనర్‌గా, పట్టణ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. బీజేపీ జాతీయ కార్యాలయం, ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇన్‌చార్జిగా పనిచేశారు. భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధానకార్యదర్శిగా, పట్టణ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా, జాతీయ కార్యదర్శిగా పార్టీకి సేవలందించారు. కరీంనగర్‌లో వరుసగా రెండు సార్లు బీజేపీ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. కేరళ, తమిళనాడు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఎల్‌కే అద్వానీ చేపట్టిన సురాజ్‌ రథయాత్రలో వాహన ఇన్‌చార్జి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అద్వానీ దృష్టిని ఆకర్శించారు. అప్పట్లోనే ప్రస్తుత దేశ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు కొద్దిరోజులు సేవలు అందించారు. ప్రస్తుత దేశ హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డికి సన్నిహితుడిగా బీజేవైఎంలో సేవలు అందించారు. 

గల్లీ నుంచి ఢిల్లీ దాకా ...
కరీంనగర్‌ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకులో రెండు పర్యాయాలు డైరెక్టర్‌గా(1994, 1999) ఎన్నికైన సంజయ్‌ విజయవంతమైన నాయకుడిగా ఎదిగారు. అనంతరం కరీంనగర్‌ నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత 2005లో తొలిసారి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 48వ డివిజన్‌ కార్పొరేటర్‌గా తొలిసారి ఎన్నికై 2009, 2014లో మరో రెండు పర్యాయాలు కార్పొరేటర్‌గా ప్రాతినిధ్యం వహించి, ఆయన కరీంనగర్‌ పట్టణంపై తనదైన ముద్ర వేసుకున్నారు. హిందుత్వవాదిగా తన డివిజన్‌లో మహాలక్ష్మి దేవాలయాన్ని వ్యయప్రయాసల కోర్చి నిర్మించారు. అనంతరం 2014 సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీపై దృష్టి పెట్టారు. కరీంనగర్‌ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి 52 వేల పైచిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరపున పోటీ చేసి 66,009 ఓట్లు సాధించి మళ్లీ రెండో స్థానమే దక్కినప్పటికీ, జాతీయ పార్టీ నేతలు సైతం బండి వైపు దృష్టి సారించే విధంగా ఓట్లు సాధించారు. రాష్ట్రంలో గోషామహల్‌ నుంచి గెలుపొందిన రాజాసింగ్‌ కన్నా సంజయ్‌కే ఎక్కువ ఓట్లు లభించడం గమనార్హం.

ఉద్యమ ఖిల్లాలో ఎంపీగా విజయతీరాలకు...
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ... 2019 పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్‌ స్థానం టికెట్టు సాధించేందుకు పావులు కదిపారు. మహామహులు పోటీపడినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల ఆధారంగా కరీంనగర్‌ ఎంపీగా బీజేపీ టికెట్టు సాధించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓటమి పాలైన సానుభూతితోపాటు మోదీ హవా, హిందుత్వ నినాదం, స్థానిక పరిస్థితులు కలిసొచ్చాయి. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, సిట్టింగ్‌ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌పై ఏకంగా 96వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి నుంచే బండి సంజయ్‌పై పార్టీలో, ఆర్‌ఎస్‌ఎస్‌లో అంచనాలు పెరిగాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం పావులు కదిపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్‌ను తెరపైకి తెచ్చారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం రాష్ట్రంలో పలువురు నేతలు పోటీపడ్డా... చివరకు బండి సంజయ్‌నే పదవి వరించింది. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా పనిచేసిన కె.లక్ష్మణ్‌ స్థానంలో ఆయన సామాజిక వర్గానికే చెందిన బండి సంజయ్‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ ప్రకటించింది.

సాగర్‌జీ తరువాత సంజయ్‌...
మూడు దశాబ్దాల క్రితం కరీంనగర్‌లో భారతీయ జనతా పార్టీ అంటే చెన్నమనేని విద్యాసాగర్‌రావు అనే పేరుండేది. 1982లో బీజేపీ ఆవిర్భావం తరువాత సీహెచ్‌.విద్యాసాగర్‌రావు మెట్‌పల్లి నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికవుతూ వచ్చారు. 1998లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తొలిసారిగా విద్యాసాగర్‌రావు కరీంనగర్‌ పార్లమెంటు అభ్యర్థిగా విజయం సాధించారు. తరువాత 1999 పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి ఎంపీగా గెలిచిన విద్యాసాగర్‌రావు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1990వ దశకంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించిన చరిత్ర విద్యాసాగర్‌ రావుది. విద్యాసాగర్‌రావు తరువాత కరీంనగర్‌ జిల్లా నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన రెండో నేత బండి సంజయ్‌కుమార్‌ కావడం విశేషం. 

మరిన్ని వార్తలు