కేసీఆర్‌ రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించారు

14 May, 2020 02:38 IST|Sakshi

పోతిరెడ్డిపాడును ఆపలేని అసమర్థుడు సీఎం కేసీఆర్‌ 

సీఎం తీరుపై బండి సంజయ్‌ నిరసన దీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ ప్రయోజనాలను విస్మరించి వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును ఆపలేని సీఎం అసమర్థతకు నిరసనగా బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం లాక్‌డౌన్‌ నిబంధనలకు లోబడి ఈ దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం ఈ నెల 5న జీవో జారీ చేస్తే, ప్రతిపక్షాలు వెంటనే స్పందించగా.. సీఎం మాత్రం 11న స్పందించడం ఆయన నిబద్ధతకు అద్దం పడుతోందని దుయ్యబట్టారు.

కృష్ణా నది ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పాత మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల బీజేపీ నేతలు, కార్యకర్తలు దీక్ష చేపట్టారని తెలిపారు. ఏపీ జారీ చేసిన తాజా జీవో పాత రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలపై దుష్ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటా 299 టీఎంసీల నీటిని సైతం పూర్తిగా వినియోగించుకోవడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న చట్టవిరుద్ధ నీటి వినియోగంపై టీఆర్‌ఎస్‌ సర్కారుకు పట్టింపు లేకుండా పోయిందన్నారు. తాజాగా 80,000 క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచేందుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, అయినా చర్యలు చేపట్టని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. 

విచారణకు ఆదేశించిన కేంద్ర మంత్రి.. 
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో పట్ల కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు లేఖ రాసినట్లు బండి సంజయ్‌ తెలిపారు. ఆ జీవో వల్ల తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు జరిగే నష్టాన్ని ఆ లేఖలో వివరించినట్లు పేర్కొన్నారు. తాము రాసిన లేఖపై వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి ఈ అంశంపై విచారణ జరిపి రెండ్రోజుల్లో వాస్తవాలను వివరించాలని కృష్ణా బోర్డును ఆదేశించినట్లు వివరించారు. కాగా, కరోనా కారణంగా తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ప్యాకేజీ అనేక రంగాలకు ఎంతో తోడ్పాటు అవుతుందని సంజయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు