కేసీఆర్‌ నిజాం పరమభక్తుడిలా మారారు

2 Nov, 2019 13:03 IST|Sakshi

సాక్షి,కరీంనగర్‌ : ఆర్టీసీ కార్మికుడు చనిపోతే శవరాజకీయం అంటున్న వారు ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం 1200 మంది ప్రాణత్యాగం చేస్తే మీరు చేసింది ఏమిటో చెప్పాలంటూ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. తాను ఒక ఎంపీనన్న విషయం మరిచి కాలర్‌ పట్టుకొని దాడి చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై ప్రివిలైజేషన్‌ మోషన్‌ను మూవ్‌ చేస్తామని హెచ్చరించారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై పోలీసు అధికారులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

పోలీసులు యునిఫామ్‌లు లేకుండా మఫ్టీలు, మాస్కులు వేసుకొని వచ్చి లాఠీచార్జీ చేయడం నిజాం నిరంకుశ పాలనను గుర్తుకు తెస్తుందని విమర్శించారు. కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని, కరీంనగర్‌ నుంచే ఆయన పతనం ప్రారంభమైనట్లు తెలిపారు. ప్రగతి భవన్‌లో కూర్చొని జల్సాలు చేస్తున్న కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ పార్టీకి పోలీసులు గులాంగిరి చేస్తూ వ్యవస్థను నాశానం చేస్తున్నారని ఆరోపించారు. నిజాం పరమభక్తుడిలా తయారైన కేసీఆర్‌ను ప్రగతి భవన్‌కే పరిమితం చేస్తామని వెల్లడించారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆ రుచి ఎలా ఉంటుందో ఆయనకు త్వరలోనే అర్థమయ్యేటట్లు చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్‌లో జరిగిన సంఘటనను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. దాదాగిరి, దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ సహించేది లేదని చట్టపరిధిలోనే కేంద్రం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు