‘కరోనా పరీక్షలు ఆపడంతో కేసుల సంఖ్య తగ్గింది’

29 Apr, 2020 14:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ బుధవారం భాద్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అధ్యక్షుడి కుర్చీలో కూర్చున్నారు. మార్చి 11న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బండి సంజయ్‌ని తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత పార్టీ కార్యాలయానికి అనేక సార్లు వచ్చినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ ముఖ్యనేతలు లక్ష్మణ్‌, ధర్మపురి అర్వింద్‌, మోత్కుపల్లి నరసింహులు తదిరుల సమక్షంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ మీడియాతో మట్లాడారు.ఈ రోజు బాధ్యతలు తీసుకున్నా. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. మార్చి 20 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతుంది. అన్ని వర్గాల ప్రజలు సహకరించారు. కేంద్ర సూచనలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాయి. దేశ ప్రజల ఐక్యతకు ఇది స్పూర్తి. కరోనా నివారణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకు సహకరించాము. భవిష్యత్‌లో కూడా సహకరిస్తాము. వైద్యం, లాక్ డౌన్ అమలుకు సేవ చేయడానికి బీజేపీ కార్యకర్తలు ముందు వరుసలో ఉన్నారు.

కరోనా పరీక్షలు ఆపడంతో కేసుల సంఖ్య తగ్గింది. ఐసీఎమ్‌ఆర్‌ ఎక్కడా పరీక్షలు తగ్గించమని చెప్పలేదు. మృతదేహాలకు కూడా పరీక్షలు చేయవద్దని ఆదేశాలు ఎలా ఇస్తారు. డీఎమ్‌ఈ సర్కులర్ ఎలా జారీ చేస్తారు ? రికార్డుల కోసం, రివార్డుల కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. వైరస్ మహమ్మారిని తగ్గించడానికి ప్రభుత్వం పనిచేస్తుందా? పేరు కోసం పరీక్షలు చేయడం ఆపేస్తారా? అఖిల పక్షం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ముందుకు వెళ్తుంది. కేంద్రం ఇచ్చే రిపోర్టుల్లో రాష్ట్రంలో 26 మంది చనిపోయినట్లు ఉంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం 25 మంది చనిపోయినట్లు చూపెడుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులను ప్రభుత్వం దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? అని బండి సంజయ్ అన్నారు.

మరిన్ని వార్తలు