టీఆర్‌ఎస్‌ అరాచకాలపై పోరాడతాం : బండి సంజయ్‌

26 Jul, 2019 11:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కోడిముంజ గ్రామంలో గౌడ కులస్తుపై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడులు చేశారని చెప్పారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితులపై పోలీసులు ఉల్టా కేసులు బనాయించారని మండిపడ్డారు. తగిన ఆధారాలు లేకుండానే వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని.. అన్యాయంగా 13 మందిని నెలరోజులపాటు జైలుకు పంపారని అన్నారు. బాధితులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హింస్తున్నారని ఆరోపించారు.

బాధితులకు బెయిల్‌ ఇవ్వకుండా టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నారని విమర్శించారు. కులవృత్తి చేసుకుని జీవించే గౌడ కులస్తుల పట్ల ఈ రకంగా వేధింపులకు పాల్పడటం సరికాదన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. బాధితుల పక్షాన బీసీ కమిషన్‌ ఆశ్రయిస్తామని తెలిపారు. వారికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు