‘కృష్ణా’ వాటా కోసం పోరాట కమిటీ 

2 Jun, 2020 05:21 IST|Sakshi

త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌  

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. అందుకే తెలంగాణ ప్రాంతానికి నికర, వరద జలాల్లో న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం కృష్ణా నదీ జలాల పోరాట కమిటీని ఏర్పాటు చేసి, కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ అధ్యక్షతన కృష్ణా నదీ జలాల సద్వినియోగంపై సోమవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు, తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. నదీ జలాల వాడకం విషయంలో టీఆర్‌ఎస్‌ సర్కారు అనుసరిస్తున్న చట్ట వ్యతిరేక విధానాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రత్యక్ష పోరాటాలు చేపట్టాలని నిర్ణయించారు.

ఉమ్మడి ఏపీలో, ఇప్పుడు కూడా బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు ఇచ్చిన దాంట్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా దక్కడం లేదని సంజయ్‌ అన్నారు. తెలంగాణ వాటాను సాధించుకునేందుకు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ దగ్గర ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ గత ఆరేళ్లుగా ఈ ట్రిబ్యునల్‌ ముందు రాష్ట్ర వాదనలు సరిగా వినిపించలేని పరిస్థితి దాపురించిందన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు 811 టీఎంసీలలో మన వాటాను పెంచుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్‌ సద్వినియోగం చేసుకోలేకపోయారన్నారు.

అనంతరం కృష్ణానదీ జలాలపై కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాజెక్టుల సాధన పోరాట సమితి ఏర్పాటు చేసి ముందుకు సాగుతామన్నారు. సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, ఎంపీ ధర్మపురి అరవింద్, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, కె.లక్ష్మణ్, మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎంపీ వివేక్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు