కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలి: బండి సంజయ్‌

7 Sep, 2019 15:00 IST|Sakshi

సాక్షి, రాజన్నసిరిసిల్ల: యాదాద్రి ఆలయంలో తన ఫోటోలు పెట్టుకున్న కేసీఆర్‌ చర్చిలో, మసీదుల్లో కూడా ఇలానే చేయగలరా అంటూ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ప్రశ్నించారు. శనివారం వేములవాడ వినాయకుని వద్ద పూజలు నిర్వహించిన సంజయ్‌ కుమార్‌ అనంతరం మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన యాదాద్రి ఆలయంలో కేసీఆర్‌ తన ఫోటోలు, పార్టీ ఫోటోలు ప్రదర్శించడం నిజంగా దారుణమన్నారు. కరీంనగర్‌ వేదికగా హిందుగాళ్లు, బొందుగాళ్లు అన్న కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. హిందూ దేవాలయం కేంద్రంగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేసీఆర్‌కు నిజంగానే దేవుడి పట్ల, ధర్మం పట్ల చిత్తశుద్ధి ఉంటే.. యాదాద్రి వెళ్లి అర్చకులతో కలిసి ఫోటోలు తొలగించి, పాలాభిషేకం చేయాలని.. అప్పుడే హిందూ సమాజం కేసీఆర్‌ను క్షమిస్తుందన్నారు. లేదంటే కేసీఆర్‌ తగిన మూల్యం చెల్లించుకుంటారని సంజయ్‌ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు