బీజేపీ నిరసన భగ్నం

16 Jun, 2020 04:54 IST|Sakshi
నాంపల్లిలో బీజేపీ చీఫ్‌ సంజయ్‌ను అరెస్టు చేస్తున్న పోలీసు అధికారి

విద్యుత్‌ చార్జీల భారాన్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళనబాట

ఎక్కడికక్కడ నేతలను అరెస్టు చేసిన పోలీసులు

సర్కారు తీరుపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ మండిపాటు

ఖజానా నింపుకొనేందుకే అధిక విద్యుత్‌ చార్జీలని ధ్వజం

విద్యుత్‌ బిల్లుల మాఫీపై పోరు ఆగదని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల భారాన్ని నిరసిస్తూ విద్యుత్‌సౌధతోపాటు జిల్లాల్లోని విద్యుత్‌ కార్యాలయాల వద్ద సోమవారం భారతీయ జనతా పార్టీ చేపట్టిన నిరసనలను పోలీసులు భగ్నం చేశారు. పార్టీ ముఖ్యనేతల్లో కొందరిని అరెస్టు చేయగా.. మరికొంతమందిని గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లో విద్యుత్‌ కార్యాలయం వద్ద ధర్నాకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ను, పార్టీ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులను నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద అరెస్టు చేసి అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైదరాబాద్‌లోని వారి ఇళ్లలో నిర్బంధించారు. పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావును తార్నాకలో హౌస్‌ అరెస్టు చేశారు. కోర్‌ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డిని మింట్‌ కాంపౌండ్‌ వద్ద అరెస్టు చేసి రాంగోపాల్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నాగోల్‌లోని విద్యుత్తు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తిని అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌లో ఎంపీ సోయం బాపురావు, వరంగల్‌లో మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, జగిత్యాలలో పేరాలæ శేఖర్‌రావు, నల్లగొండలో ప్రేమేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో జితేందర్‌రెడ్డి, డీకే అరుణ, వికారాబాద్‌లో రాపోలు ఆనంద భాస్కర్‌ను అరెస్టు చేశారు.
బీజేపీ నేత లక్ష్మణ్‌ను ఆయన నివాసం వద్ద గృహనిర్బంధం చేస్తున్న పోలీసులు 

ప్రజా సమస్యలపై గళమెత్తితే నిర్బంధాలా?
పార్టీ నేతల అరెస్టులపై బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న నేతలను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లుల రూపంలో నెత్తిన పిడుగు వేసిందని విమర్శించారు. మూడు నెలలు వినియోగించిన యూనిట్లను సగటు చేయడం ఎక్కడి విధానమో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. ఖజానా నింపుకొనేందుకే అధిక విద్యుత్‌ చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్ని దోచుకోవాలనే దురుద్దేశంతోనే దోపిడీ విధానాలకు రూపకల్పన చేశారని ధ్వజమెత్తారు. ‘‘లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అరెస్టులకు పాల్పడం దారుణం.

ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భయపడరు. టీఆర్‌ఎస్‌ సర్కారు అశాస్త్రీయ, అసంబద్ధ శ్లాబుల విధానాలపై బీజేపీ పోరు కొనసాగిస్తుంది’’అని సంజయ్‌ స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏదో ఒకవిధంగా ప్రజల నడ్డివిరిచేలా వ్యవహరిస్తూ రూ.340 కోట్లకు పైగా కొల్లగొట్టాలని కుట్ర చేసిందని ఆరోపించారు. ప్రజలపై పడిన అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, అధిక బిల్లుల రద్దుకు టీఆర్‌ఎస్‌ సర్కారు నిర్ణయం తీసుకునే వరకు బీజేపీ విశ్రమించదని ఆయన ఉద్ఘాటించారు. ప్రభుత్వం వెంటనే సమీక్షించి, పెంచిన విద్యుత్‌ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

కరోనా పరీక్షలు ఇప్పుడు గుర్తొచ్చాయా?
కరోనా పరీక్షలపై కేంద్రం సీరియస్‌గా దృష్టి పెట్టడంతో సీఎం కేసీఆర్‌ హడావుడి చర్యలు చేపట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ విమర్శించారు. కరోనా వ్యాధి తీవ్రంగా విజృంభిస్తోందని, టెస్టులు చేసి వ్యాప్తిని అరికట్టాలని ఎంత విజ్ఞప్తి చేసినా రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదన్నారు. మూడు నెలల్లో కేవలం 39వేల మందికి మాత్రమే టెస్టులు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు 50వేల మందికి టెస్టులు చేస్తామని చెప్పడం సమ్మశక్యంగా లేదన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు వ్యాధి సోకిన తర్వాతనే ప్రభుత్వానికి తీవ్రత అర్థమైందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా నియోజకవర్గాల వారీగా టెస్టులు చేయడం సరికాదని, జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు