అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ఫైర్‌

25 Jul, 2019 18:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ, ఆరెస్సెస్‌లపై మజ్లిస్‌ పార్టీ శాసన సభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ తీవ్రంగా ఖండించారు. ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ పార్టీలు ఎంతకైనా దిగజారుతాయని మండిపడ్డారు. గురువారం పార్లమెంట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్‌లో హిందూ గాళ్ల రాజ్యం నడుస్తోందని, బొందు గాళ్ల రాజ్యం కాదన్నారు. హిందువుల యాత్రలపైన ఎంఐఎం కార్యకర్తలు దాడులకు పాల్పడేవారని, క్రికెట్‌లో టీమిండియా గెలిస్తే నల్లజెండా ఎగర వేసేవారని బండి సంజయ్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు లోపాయకారి ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌లో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువుల అంతు చూస్తా అన్న పార్టీతో టీఆర్‌ఎస్‌ దోస్తీ కట్టిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కాషాయ జెండా మాత్రమే ఎగరబోతోందని జోస్యం చెప్పారు. ఎంఐఎం ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే వారి బాగు కోసం ప్రధాని నరేంద్ర మోదీ ట్రిపుల్‌ తలాక్‌ని చట్ట బద్దం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు.

దురదృష్టవశాత్తు మిమ్మల్ని ఎన్నుకున్నారు 
కరీంనగర్‌ సభలో అక్బరుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు ఎంఐఎం నేతలను ఎన్నుకున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏప్రిల్‌ 20 మీ ఇలాఖలో ఏం జరిగిందో గుర్తుకు లేదా అక్బరుద్దీన్‌? మీ వాళ్లు నీపై హత్యాయత్నం చేసి కిడ్నీలు, అవయవాలు అన్నీ డీలా అయ్యేలాగా చేసిన విషయం గుర్తుకు రాలేదా? మా హిందువులను ఏం చేస్తావ్‌. నీ బొంద చేస్తావ్‌. ముస్లిం పేరుతో మీ అన్నదమ్ములు ఇద్దరు పబ్బం గడుపుతున్నారు. ఎంఐఎం మత రాజకీయాలకు తెర తీస్తోంది.  ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉండు.. లేదంటే నీ చికిత్స ఫెయిలై ఉన్న జీవితం పోగొట్టుకుంటావ్‌’అంటూ అరవింద్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు