పశ్చిమలో రంజుగా రాజకీయం

11 Mar, 2019 12:50 IST|Sakshi

గోపాలపురం టికెట్‌ విషయంలో యూటర్న్‌ తీసుకున్న బాపిరాజు

ముప్పిడికి టికెట్‌ ఇవ్వొద్దంటూ చంద్రబాబును కలసిన పలువురు నేతలు

అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నంలో ఎమ్మెల్యే వర్గం

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల:  ఈ సారి కూడా అధికారం తమదేనని పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోన్న టీడీపీ నేతల్లో.. లోలోపల ఓటమి భయం వెంటాడుతోంది. గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. అయితే ఈ సారి ఆ స్థానాల్లో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గడచిన ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు చేసిన అవినీతి, అక్రమాలే అందుకు కారణమని స్పష్టంగా తెలుస్తోంది. పైగా నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, నరసాపురం టికెట్లను సిట్టింగులకు కేటాయించడానికి వీల్లేదంటూ సొంత పార్టీలోని వ్యతిరేక వర్గం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి ఆదిలోనే చుక్కెదురైనట్టు కనిపిస్తోంది.

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గెలుపు ఖాయం
గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుపై నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పలువురు నేతలు గుర్రుమంటున్నారు. గత ఎన్నికల్లో గెలుపొందిన ముప్పిడి ఒక సామాజిక వర్గంలోని, కొంతమంది నేతలకు మాత్రమే మేలు చేశారని ఆరోపిస్తున్నారు. ఈసారి ఆయనకు టికెట్‌ కేటాయిస్తే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అఖండ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలోనే నాలుగు మండలాలకు చెందిన 250 మంది నాయకులు, 60 కార్లలో బయల్దేరి ఈ నెల 5న అమరావతికి చేరుకున్నారు. అక్కడ చంద్రబాబును కలసి, ముప్పిడిపై వ్యతిరేకతను వెళ్లబుచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ మంచి అభ్యర్థిని కేటాయిస్తానని, అతడ్ని గెలిపించమని తమతో చెప్పినట్లు పలువురు నాయకులు చెబుతున్నారు. అయితే చంద్రబాబును కలవడానికి ముందు ద్వారకా తిరుమల ఎంపీపీ వడ్లపూడి ఈశ్వర భానువరప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. గోపాలపురం ఎమ్మెల్యే టికెట్‌ ముప్పిడి వెంకటేశ్వరరావుకు ఇచ్చారని తెలిసి, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నారని, స్వీట్లు కూడా పంచుకుంటున్నారని అన్నారు. ఆయనకే గనుక టికెట్‌ కేటాయిస్తే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అఖండ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని, అందుకే తాము చంద్రబాబును కలవడానికి వచ్చినట్లు చెప్పారు. ముప్పిడికి టికెట్‌ ఇస్తానంటే తాము ఒప్పుకోమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు ఎమ్మెల్యే ముప్పిడి వర్గం శతవిధాలా ప్రయత్నం చేస్తోంది.

బాపిరాజు యూ టర్న్‌
ఈ సారి గోపాలపురం అసెంబ్లీ స్థానాన్ని తమకు కేటాయించాలని సిట్టింగ్‌ ఎమ్మెల్యేతో పాటు, నల్లజర్లకు చెందిన మద్దిపాటి వెంకటరాజు, ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురానికి చెందిన యేపూరి దాలయ్య తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే వెంకటరాజుకు మొదటి నుంచి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, అతని అనుచరగణం మద్దతుగా నిలిచినట్టు తెలుస్తోంది. అయితే ఈనెల 2న చంద్రబాబుతో జరిగిన సమీక్ష సమావేశంలో బాపిరాజు ఉన్నట్టుండి ముప్పిడికి జై.. కొట్టి, యూటర్న్‌ తీసుకున్నట్టు కొందరు టీడీపీ నేతలు తెలిపారు. బాపిరాజు అలా ప్రవర్తించడం వెనుక ఆంతర్యం ఏమిటో సొంత పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఇదిలా ఉంటే బాపిరాజు అనుచరగణం మాత్రం చంద్రబాబును కలసి, ముప్పిడికి మినహా ఎవరికి టికెట్‌ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ముప్పిడి టికెట్‌.. మళ్లీ ప్రశ్నార్థకంగా మారిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయోమయంలో బాపిరాజు
బాపిరాజు మొదటి నుంచి తాడేపల్లిగూడెం టికెట్‌పై కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే కుల సమీకరణలో భాగంగా ఆ టికెట్‌ను ఈలి నానికి చంద్రబాబు ఖరారు చేయడం, బాపిరాజును, అతని వర్గాన్ని అయోమయానికి గురిచేసింది. అయితే బాబును ఒప్పించేందుకు బాపిరాజు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బాపిరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా.. లేక బాబు మాటకు తలొగ్గుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.  

ప్రలోభాలను అడ్డుకుంటాం : ఎస్పీ
ఎస్పీ ఎం రవిప్రకాష్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల సమయంలో మద్యం, నగదు, ఓటరును ప్రలోభానికి గురి చేసే ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. దీనికోసం ఇప్పటికే అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలెవరైనా రూ.లక్షకు మించి నగదు, రూ. 50 వేల విలువకు మించి బంగారు ఆభరణాలు తీసుకువెళ్లకూడదన్నారు. అలా తీసుకువెళ్లాల్సి వస్తే అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఆధారాలు చూపకపోతే వాటిని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. బ్యాంకుల ద్వారా అధిక మొత్తాల్లో జరిగే లావాదేవీలపై నిఘా పెట్టామని, దీనిపై ఇప్పటికే అన్ని బ్యాంకుల నుంచి వివరాలు సేకరించామని తెలిపారు.

ఎన్నికల సమయంలో మద్యం బెల్టు షాపులను నియంత్రిస్తున్నామని, ఇప్పటికే 45 కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలోని 3411 పోలింగ్‌ స్టేషన్లలో పోలీస్‌ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామని ఎన్నికల నిర్వహణకు 35 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలను కోరామని, తొలి విడతగా ఇప్పటికే 5 కంపెనీల బలగాలు జిల్లాకు చేరుకున్నాయని స్పష్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర భద్రతా బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే 334 రూట్‌ మొబైల్‌ బృందాలను ఏర్పాటు చేశామని, ఇందుకు సంబంధించి 1560 మంది పోలీసు సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వివాదాలకు కారణమైన వారిని గుర్తించి, వీరిలో 17 వందల మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశామని, జిల్లాలో లైసెన్స్‌ కలిగిన 469 ఆయుధాలను, లైసెన్స్‌లేని 94 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. విలేకరుల సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం వేణుగోపాల రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ సత్యనారాయణ, ఆదనపు ఎస్పీ ఈశ్వరరావు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు