ఫార్మల్‌ సభ... ఫార్మల్‌గానే జరిగింది

21 Jan, 2019 02:18 IST|Sakshi

వచ్చే సమావేశాల నుంచి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం

మీడియాతో చిట్‌చాట్‌లో ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క  

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫార్మల్‌గా జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు ఫార్మల్‌గానే జరిగాయని ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. వచ్చే సమావేశాల నుంచి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని ఆదివారం శాసనసభలోని తన చాంబర్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ భట్టి చెప్పారు. గత రెండేళ్లుగా ప్రజాసమస్యలపై రాష్ట్రంలో చర్చ జరగడం లేదని, బాధ్యతాయుత ప్రతిపక్షంగా రానున్న కాలంలో ప్రజాసమస్యలపై నిర్మాణా త్మకంగా పోరాడతామని అన్నారు. రూ. 2.5 లక్షల కోట్ల ఖర్చుతో కూడిన ప్రాజెక్టులకు తానే డిజైనర్‌ అని సీఎం అంటున్నారని, కేసీఆర్‌ సాంకేతికంగా అంత నిపుణుడు అయిన ప్పుడు ఇక ఇంజనీర్లు ఎందుకని ప్రశ్నించారు. గత సభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన జానారెడ్డిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తోకూడా తనకు సన్నిహిత సంబంధాలు న్నాయన్నారు. కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్స హిస్తారని తాను అనుకోవడం లేదని భట్టి అన్నారు. 

ఎత్తిపొడవటం సరికాదు: భట్టి 
వివిధ మాధ్యమాలు, ప్రజల ద్వారా తమ దృష్టికి వచ్చిన అంశాలను సభ్యులు లేవనెత్తితే సీఎం పదే పదే సభ్యుని పేరు పేర్కొంటూ ఎత్తిపోడవడం హుందాతనం అనిపించుకోదని సభలో భట్టి పేర్కొన్నారు. సభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్‌ ఆయన పేరు ప్రస్తావించి మాట్లాడటంపై భట్టి విక్రమార్క పై విధంగా స్పందించారు. సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ.. మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్లు చెబితే జీర్ణించుకోకపోతే తామేం చేయలేమన్నారు.

భట్టికి సీఎం అభినందన
తెలంగాణ కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సీఎల్పీ) నేతగా ఎంపికైన మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం శాసనసభ ప్రారంభమైన వెంటనే మల్లు భట్టి విక్రమార్క కూర్చున్న సీటు వద్దకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెళ్లి కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. భట్టిని ప్రతిపక్ష నేతగా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు