భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు: భట్టి విక్రమార్క

23 Dec, 2019 15:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మతపరమైన నిర్ణయంతో దేశంలో వాతావరణ కలుషితం చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన ఎన్నార్సీ, సీఏఏలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఫాసిస్టు నిర్ణయాలను ఖండించాలన్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికి, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ గెలవడానికి ఎంఐఎం పరోక్షంగా కారణమని ఆరోపించారు.

ఎంఐఎం బీజేపీకి రహస్య మిత్రుడని, కోట్లాదిమంది ముస్లింలకు అగ్నిపరీక్షగా మారిందని మండిపడ్డారు. లౌకికవాద శక్తులను దూరంగా పెట్టడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని, వీటిపై టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇది ఒక్క ముస్లింల సమస్య కాదని, అందరి సమస్య అని పేర్కొన్నారు. బీజేపీ తీసుకున్న నిర్ణయాలపై పునరాలోచించాలని సూచించారు. ఈ నెల 28న గాందీ భవన్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని, సీఏఏని వ్యతిరేకిస్తూ చేస్తున్న ర్యాలీని విజయవంతం చేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు