హాట్‌ సీటు: బేగుసరాయి

26 Apr, 2019 01:08 IST|Sakshi

కొత్తతరం రాజకీయ వేదిక  

కన్హయ్య కోసం దిగివస్తున్న తారలు  

త్రిముఖ పోటీలో గెలిచేదెవరు ? 

నాలుగోదశ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హాట్‌ సీటు బిహార్‌ రాష్ట్రంలో బేగుసరాయి. జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీని నేరుగా ఢీకొంటున్న యువ నేత కన్హయ్యకుమార్‌ ఈ స్థానం నుంచి సీపీఐ తరఫున పోటీ చేస్తూ ఉండటంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది. బేగుసరాయి ఒకప్పుడు సీపీఐకి కంచుకోట.. లెనిన్‌గ్రాడ్‌ ఆఫ్‌ బిహార్‌గా పేరు పొందింది. గత ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా బేగుసరాయిలో కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ అభ్యర్థి భోలాసింగ్‌ ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఆయన గత ఏడాది మరణించడంతో అప్పట్నుంచి ఈ స్థానం ఖాళీగానే ఉంది.

కన్హయ్యకు మద్దతుగా తారాతోరణం
ఒక ప్రశ్నించే యువగళం చట్టసభల్లో గొంతు విప్పాలని కోరుకుంటున్నవారెందరో. అందుకే కన్హయ్యకుమార్‌ నామినేషన్‌ సమయంలో జనం స్వచ్ఛందంగా వెల్లువెత్తారు. అరాచకశక్తులపై పోరాటం చేసే వీరుడిగా కన్హయ్యకుమార్‌ని నేతలు అభినందించారు. ప్రధాని నరేంద్రమోదీ విధానాల్ని నిరసిస్తూ ఒకే భావజాలం కలిగిన నాయకులు కన్హయ్యకు మద్దతుగా బేగుసరాయిలో ప్రచారం నిర్వహించారు. ఉద్యమకారులు జిగ్నేశ్‌ మేవానీ, , తీస్తా సెటల్వాద్‌లు ప్రచారం చేశారు. బాలీవుడ్‌ రచయిత జావేద్‌ అక్తర్, ఆయన భార్య షబానాఆజ్మీ, స్వరభాస్కర్, బెంగళూరు సెంట్రల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్‌రాజ్‌ వంటి వారు కన్హయ్యకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ‘‘పార్లమెంటులో ప్రజాగళం వినబడాలి. కన్హయ్యకుమార్‌ వంటివారు చట్టసభలకి ఎంతో అవసరం. అందుకే ఆయన తరఫున ప్రచారానికి వచ్చా‘‘అని ప్రకాశ్‌ రాజ్‌ చెప్పారు. మరోవైపు కన్హయ్యకు నిరసనలు ఎదురవుతున్నాయి. ప్రచారానికి వచ్చిన కన్హయ్యను చాలా చోట్ల యువకులు నిలదీస్తూ నీకు కావల్సిన స్వేచ్ఛ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

2014లో ఫలితాలు ఇలా 
వామపక్షాలకు ఇంకా పట్టున్న జిల్లాల్లో బేగుసరాయి కూడా ఒకటి. కానీ గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాన్ని ఎగరేసుకుపోయింది. అప్పటివరకు కమ్యూనిస్టు నాయకుడిగా సుప్రసిద్ధుడైన భోలాసింగ్‌ ఆఖరినిముషంలో బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్‌ çహసన్‌ నిలిచారు. ఇక సీపీఐ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్‌ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

త్రిముఖ పోటీలో కన్హయ్య సతమతం
సీపీఐ పార్టీ పూర్వ వైభవం సాధించడం కోసం కన్హయ్యకుమార్‌ని రంగంలోకి దింపింది. స్థానికుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. అంతేకాదు భూమిహార్‌ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ నియోజకవర్గంలో వారి ఓట్లు అత్యంత కీలకం. 4 లక్షలకు పైగా ఓట్లు వారివే ఉన్నాయి. అందుకే కాషాయదళం భూమిహార్‌ అయిన కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను నవాదా నియోజకవర్గం నుంచి మార్చి మరీ కన్హయ్యపై పోటీకి నిలిపింది. గత ఎన్నికల్లో మోదీ హవా దేశాన్ని ఊపేసినా ఆర్‌జేడీ అభ్యర్థి తన్వీర్‌ హసన్‌ 3.69 లక్షల ఓట్లను కొల్లగొట్టారు. అందుకే ఈసారి కూడా లాలూ పార్టీ తన్వీర్‌ హసన్‌నే మళ్లీ బరిలో దింపింది. తన్వీర్‌ హసన్‌ది అందరితోనూ కలిసిపోయే తత్వం. ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. బేగుసరాయి నియోజకవర్గంలో ఆయనకి వ్యక్తిగత కరిష్మా ఎక్కువ. ఈ నియోజకవర్గంలో 3 లక్షలకు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. 2.5 లక్షల యాదవ్‌ ఓట్లు ఉన్నాయి. వీరంతా హసన్‌కే ఓటు వేసే అవకాశం ఉంది. మహాగ uŠ‡బంధన్‌ కన్హయ్యకుమార్‌కు మద్దతుగా నిల్చొని ఉంటే ఆయన విజయం నల్లేరు మీద బండి నడకే. కానీ త్రిముఖ పోటీలో ఓట్లు చీలి ఎవరికి లాభం చేకూరుతుందో అంచనా వేయలేని పరిస్థితి. 

కన్హయ్య కుమార్‌ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు
►ఎన్నికల ప్రచారాన్ని సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. సైకిల్, స్కూటర్, ఓపెన్‌ టాప్‌ కారు, ఒక్కోసారి నడుస్తూ కూడా ప్రచారం చేస్తున్నారు
► రైతు బిడ్డ. ఎన్నికల్లో ఖర్చు కోసం ప్రజల దగ్గర నుంచి ఒక్కొక్కరు రూపాయి ఇచ్చినా చాలంటూ నిధులు సేకరించారు
► వామపక్ష భావాలతో స్వేచ్ఛ కోసం గొంతెత్తిన యువగళం. పేదరిక నిర్మూలన, అరాచకాలు, అన్యాయాల్ని పారద్రోలడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. 

గిరిరాజ్‌ సింగ్‌ కేంద్ర మంత్రి
►ప్రచార ఆర్భాటాలు ఎక్కువ. ఎస్‌యూవీల్లోనే తిరుగుతుంటారు
►బీజేపీ అతివాద నాయకుల్లో ఒకరు. హిందూమత పరిరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తానని ప్రచారం చేసుకుంటూ వివాదాల్లో తరచూ చిక్కుకుంటారు. 
►  అధిష్టానం ఆదేశం మేరకు కన్హయ్య పేరు కూడా కనీసం ప్రస్తావించకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. 

►4,28,227 (39.73%) భోలాసింగ్‌ (బీజేపీ)కు పోలయిన ఓట్లు

►3,69,892 (34.32%) తన్వీర్‌ హసన్‌ (ఆర్జేడీ)కు వచ్చిన ఓట్లు

►1,92,639 (17.87%) రాజేంద్ర ప్రసాద్‌ సింగ్‌ (సీపీఐ)కు వచ్చిన ఓట్లు 

మరిన్ని వార్తలు