దుర్గమ్మ  దయ  ఎవరిపైనో!

27 Mar, 2019 10:36 IST|Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజధాని విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ. ఒకప్పుడు తెలుగు పత్రికలన్నీ ఇక్కడ నుంచే వెలువడేవి. రాష్ట్ర రాజధాని కావడంతో మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నుంచి సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్, టీడీపీ తరఫున సిట్టింగ్‌ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) బరిలో దిగారు.   మొట్టమొదటిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో విజయవాడ నుంచి హరీంద్రనాథ్‌ చటోపాధ్యాయ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.

ఆ తర్వాత 15 సార్లు జరిగిన ఎన్నికల్లో 11 సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్‌(ఐ), నాలుగుసార్లు టీడీపీ గెలించింది. విజయవాడ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన డాక్టర్‌ కె.ఎల్‌ రావు కేంద్ర మంత్రిగా పనిచేశారు. నాస్తికోద్యమ నాయకుడు గోరా కుమార్తె చెన్నుపాటి విద్య, కేంద్ర మాజీ మంత్రి పి.ఉపేంద్ర వంటి వారు ఇక్కడి నుంచే లోక్‌సభలో అడుగుపెట్టారు. ఈ నియోజకవర్గ పరిధిలోకి తిరువూరు, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు వస్తాయి. 

టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..
జిల్లా మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తిరువూరుకు కొత్తగా దిగుమతి అయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కెఎస్‌ జవహర్‌కు స్థానిక నేతలు సహకరించడం లేదు. విజయవాడ తూర్పు, సెంట్రల్‌ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమాలతో కేశినేనికి సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీని ప్రభావం ఎంపీ ఎన్నికపైనా పడుతుందనే ఆందోళన టీడీపీలో నెలకొంది. ఇక నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అయినా పెత్తనం మాత్రం మంత్రి దేవినేని ఉమాదే.

ఆయన విధానాలు నచ్చక అనేక మంది దళిత నేతలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలోకి వచ్చేశారు. టీడీపీలో కీలకంగా ఉండే కన్నెగంటి జీవరత్నం ఇటీవల వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఇక జగ్గయ్యపేటలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ వర్గానికి, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌ వర్గానికి మధ్య విబేధాలు ఉన్నాయి. అందువల్ల ఈసారి ఇక్కడ టీడీపీని ఓడించేందుకు నెట్టెం వర్గం ప్రయత్నిస్తోంది.  

దివంగత సీఎం వైఎస్‌ను జిల్లా మరిచిపోదు..
దివంగత సీఎం వైఎస్సార్‌ తన హయాంలో పులిచింతల ప్రాజెక్టు ప్రారంభించి 80 శాతం పనులు పూర్తి చేసి జిల్లా ప్రజల దృష్టిలో అపర భగీరథుడయ్యారు. వేదాద్రి ఎత్తిపోతల పథకం నిర్మించి జగ్గయ్యపేట వాసుల దాహార్తిని తీర్చారు. రూ.4,573 కోట్లతో కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులకు 2007, నవంబర్‌లో పరిపాలన అనుమతులిచ్చారు. పనులు ప్రారంభమై వేగంగా జరుగుతున్న క్రమంలో ఆయన దుర్మరణంతో పరిస్థితి మారింది. తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 

పొట్లూరి వీరప్రసాద్‌
పొట్లూరి వీరప్రసాద్‌ (పీవీపీ) తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అసమ్మతి అనేదే లేదు. విజయవాడ వాసే కావడంతో నియోజకవర్గ వాసులకు పీవీపీ సుపరిచితులు. నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. ఆర్థికంగా స్థితిమంతులు.

కేశినేని నాని (టీడీపీ)
నోటిదురుసు ఎక్కువ. రవాణా కమిషనర్‌ బాలసుబ్ర హ్మణ్యంపై అప్పట్లో దాడి చేయడం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. తన కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని కబ్జా చేయబోయి అప్రదిష్టను మూట కట్టుకున్నారు. దేవాలయాలను, కూల్చివేసినప్పుడు తమ సమస్యలను చెప్పుకోవడానికి వెళ్లిన గోశాల ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది.  

మొత్తం ఓటరు  : 16,19,607
పురుషులు : 7,98,421
స్త్రీలు : 8,21,028
ఇతరులు : 158 

– యు.శ్యామ్‌ప్రకాశ్, సాక్షి, అమరావతి బ్యూరో 

మరిన్ని వార్తలు