ఆర్డినెన్స్‌ ప్రతులు చించిన బీసీ నేతలు

8 Jan, 2019 04:59 IST|Sakshi
ఆర్డినెన్స్‌ ప్రతులను చించుతున్న జాజుల

బీసీ రిజర్వేషన్ల తగ్గింపు హేయకరమైన చర్య: జాజుల

హైదరాబాద్‌: 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్‌లను 22 శాతంకు తగ్గించి ఆగమేఘాలపై ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయడం హేయకరమైన చర్య అని బీసీ రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి కన్వీనర్‌ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. సోమవారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌ వద్ద ప్రభుత్వ ఆర్డినెన్స్‌ ప్రతులను చించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీసీల ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్‌ 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 22 శాతంకు తగ్గించి మాకు బహుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీసీలను కలచివేస్తుందన్నారు. పంచాయతీలన్నీ ఏకగ్రీవం కావాలని కేటీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56 శాతం రిజర్వేషన్‌లను కల్పించినట్లయితే కేటీఆర్‌ అన్న మాటను మేము ఆహ్వానించేవాళ్లమని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తామంతా వ్యతిరేకంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో బీసీ నేతలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు