పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి

10 Dec, 2018 02:22 IST|Sakshi

ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌

హైదరాబాద్‌: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే విధంగా పార్లమెంట్‌లో తక్షణమే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు శనివారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ సమస్యకు రాజ్యాంగ సవరణే శాశ్వత పరిష్కారమన్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోదీతో పాటు 36 జాతీయ పార్టీల అధ్యక్షులకు వేరువేరుగా లేఖలు రాశారు.

బీసీ భవన్‌లో ఆదివారం జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ నెల11 నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టే విధంగా రాష్ట్రంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినప్పటికీ కోర్టు తీర్పులను సాకుగా చూపుతూ అమలు చేయడం లేదన్నారు. దీంతో బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని, రాజకీయ కోణంలొనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయని భావించి ఈమేరకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, రాజేందర్, నర్సింహాగౌడ్, టీఆర్‌ చందర్, మల్లేశ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు