అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి

29 Aug, 2018 01:56 IST|Sakshi

65 మందికీ టిక్కెట్లు: తమ్మినేని 

ఆడపిల్లల కోసం‘చదువుల సావిత్రి’ పథకం

రాష్ట్రవ్యాప్తంగా రూ. 5కే భోజనం 

టీజేఎస్, జనసేన, సీపీఐతో పొత్తు చర్చలు 

సాక్షి, జనగామ: రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా బహుజన లెప్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌)ను నిర్మించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. జనగామ జిల్లా కేంద్రం, రఘునాథపల్లిలో పలువురు తమ్మినేని సమక్షంలో మంగళవారం బీఎల్‌ఎఫ్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 65 మంది బీసీలకు టికెట్లు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీలు ఒకేతాను ముక్క లని చెప్పారు. పాలకులు మారుతు న్నారే తప్ప విధానాలు మారడం లేదన్నారు.

నేటికీ ప్రజల బతుకుల్లో మార్పు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం.. సమగ్రాభివృద్ధి పేరుతో లాల్, నీల్‌ జెండాలను ఏకం చేస్తున్నామని పేర్కొన్నారు. బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే విద్య, వైద్యాన్ని ప్రభుత్వమే అందించే బాధ్యతను తీసుకుంటుందని చెప్పారు. మార్కెట్లలో ఉన్న దళారీ దోపిడీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి రైతులకు మద్ధతు ధరను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. ఐదుకే భోజనం పథకాన్ని అమలు చేస్తామని, ఆడపిల్లల కోసం ‘చదువుల సావిత్రి’ పథకాన్ని ప్రారంభిస్తామని వివరించారు. పొత్తు కోసం టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, సీపీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని తమ్మినేని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు