బీసీ బిల్లు చరిత్రాత్మకం

26 Jun, 2019 08:06 IST|Sakshi
కుల సంఘాల నాయకులతో కలిసి అభివాదం చేస్తున్న కృష్ణయ్య

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి బీసీ సంఘాల నేతల అభినందనలు

ఆదర్శంగా తీసుకోవాలని ఇతర పార్టీల నేతలకు వినతి

పంజగుట్ట: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభలో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం చరిత్రాత్మక ఘట్టమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఈ బిల్లుకు పార్లమెంట్‌లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర బీసీ యువజన సంఘం  అధ్యక్షులు నీలం వెంకటేశం అధ్యక్షతన రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బీసీ బిల్లుకు మద్దతుగా 93 బీసీ కులాలు, 30 సంఘాల విద్యార్థి, యువజన, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌.కృష్ణయ్య బీసీ బిల్లును ప్రవేశపెట్టడంతో ప్రత్యేక శ్రద్ధ చూపిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డిని అభినందించారు. పార్లమెంట్‌లో ఉన్న 92 మంది బీసీ సభ్యులు వారిని చూసి నేర్చుకోవాలని, ఇప్పటికైనా వారికి పూర్తి మద్దతు పలకాలని కోరారు. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని గతంలోనే కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్‌ గాంధీని కలిసి కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. బీజేపీ కూడా బిల్లుకు మద్దతు ఇస్తూ బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకోవాలన్నారు.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన బిల్లుకు తాము మద్దతివ్వకూడదనుకుంటే వారే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని సూచించారు. త్వరలోనే బీసీ కుల సంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో పాటు అన్ని పార్టీల ప్రతినిధులను, పార్లమెంట్‌ సభ్యులను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. బీసీ బిల్లు పాసైతేనే ఎస్సీ, ఎస్టీలతో సమానంగా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు వర్తిస్తాయన్నారు.     

బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 30 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నామని, పార్లమెంట్‌వద్ద ఎన్నోసార్లు ధర్నాలు చేశామని, 40 సార్లు ప్రధానమంత్రిని కలిసి చర్చించినట్లు ఆయన గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దీనిపై స్పందించి బిల్లు పెట్టారని దీనిని ఆమోదింపజేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా చొరవ తీసుకుని అన్ని పార్టీలను సమావేశపరిచి బిల్లు ఆమోదానికి కృషి చేయాలన్నారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు రాజకీయాల్లో 14 శాతం కూడా ప్రాతినిధ్యం లేదని, దేశంలోని 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల నుండి ఒక్క బీసీ ఎంపీ కూడా లేకపోవడం దారుణమన్నారు. దేశంలో 2600 బీసీ కులాలు ఉండగా 2550 కులాలు ఇంతవరకు పార్లమెంటులో అడుగు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించిన పాలకులు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. ఇప్పటివరకు 121 సార్లు రాజ్యాంగ సవరణ జరిగినా బీసీ బిల్లుపై ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టి చట్ట సభల్లో బిసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అసెంబ్లీ, పార్లమెంట్‌ సీట్లను 100 శాతానికి పెంచి ఇప్పటివరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ గడప తొక్కని బిసీ కులాల వారికి నామినేషన్‌ పద్దతిలో నామినేట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వివిధ బీసీ సంఘాల నాయకులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, బిల్లు ప్రవేశపెట్టిన విజయసాయి రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. చిన్న వయస్సులో ముఖ్యమంత్రి అయినా ఎంతో గొప్ప మనస్సుతో ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసం చేశారన్నారు. సమావేశంలో నాయకులు గుజ్జ కృష్ణ, మల్లయ్య, వేముల వెంకటేష్, లాలు కొట వెంకటాచారి, లక్ష్మణ్‌ యాదవ్, విరోభ, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు