వైఎస్సార్‌సీపీలోకి బీద మస్తాన్‌రావు

8 Dec, 2019 03:59 IST|Sakshi
శనివారం బీద మస్తాన్‌రావుకు కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, మంత్రి అనిల్, ఎమ్మెల్యే ప్రతాప్‌ తదితరులు

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక

కొద్ది నెలల్లోనే 80 శాతానికిపైగా హామీలు నెరవేర్చారు: బీద మస్తాన్‌రావు

ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలతో ప్రజలకు ఎంతో మేలు

సాక్షి, అమరావతి: టీడీపీని వీడిన ఆ పార్టీ సీనియర్‌ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీద మస్తాన్‌రావుతోపాటు ఆయన కుమారుడు మనోజ్, అల్లుడు మహితేజ, కావలి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ దేవరాల సుబ్రహ్మణ్యం కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం బయట విలేకరుల సమావేశం నిర్వహించారు.

సీఎం 80 శాతానికిపైగా హామీలను నెరవేర్చారు: బీద
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే 80 శాతానికిపైగా ఎన్నికల హామీలను నెరవేర్చారని బీద మస్తాన్‌రావు పేర్కొన్నారు. సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి విధానాలు నచ్చి బేషరతుగా పార్టీలో చేరానని, తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. తనకు రాజకీయంగా, వ్యక్తిగతంగా శత్రువులు ఎవరూ లేరన్నారు. పార్టీలకు అతీతంగా తన ప్రాంత అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాల ప్రకారం, సీఎం  జగన్‌ ఆశయాలకు అనుగుణంగా అందరితో కలిసి పని చేస్తానన్నారు.

నెల్లూరులో టీడీపీ ఖాళీ: మంత్రి అనిల్‌ కుమార్‌
నెల్లూరు జిల్లాలో టీడీపీ ఇక ఖాళీ అయినట్లేనని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న వైఎస్సార్‌సీపీ పట్ల అంతా ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు. టీడీపీకి చెందిన మరికొందరు ముఖ్యనేతలు కూడా వైఎస్సార్‌సీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరులు కోరగా ఆయన అలా ఎందుకు మాట్లాడారో తనకు తెలియదని, బహుశా గత ప్రభుత్వం గురించి మాట్లాడి ఉండవచ్చన్నారు.

బీసీలకు పెద్దపీట: విజయసాయిరెడ్డి
తమ పార్టీ మరో 25 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బీసీలకు అన్ని రకాలుగా ప్రాధాన్యం కల్పిస్తున్నారని చెప్పారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు, చట్టసభల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌సీపీకే దక్కిందన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా