కుక్కల్ని కాల్చినట్టు.. కాల్చేశాం

14 Jan, 2020 02:02 IST|Sakshi

ఆందోళనకారులపై బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్య 

పార్టీకి సంబంధం లేదు: కేంద్రమంత్రి 

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న వారిని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కుక్కులను కాల్చినట్టు కాల్చేశామని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. సొంత పార్టీ నేతలు సైతం ఘోష్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించగా, కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో ఆ వ్యాఖ్యలకు, పార్టీకీ ఏమాత్రం సంబంధం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. నాడియా జిల్లాలో ఆదివారం జరిగిన ఒక బహిరంగ సభలో దిలీప్‌ ఘోష్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఆస్తులు ధ్వంసం చేస్తున్నా తనకు ఓటేశారన్న కారణంగా దీదీ (మమత) ఆందోళనకారులపై కాల్పులు జరపలేదు.

ఉత్తరప్రదేశ్, అసోం, కర్ణాటకల్లోని మా ప్రభుత్వాలు మాత్రం ఆందోళనకారులను కుక్కలను కాల్చినట్టు కాల్చేశారు’ అని దిలీప్‌ వ్యాఖ్యానించారు. అయితే కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో..‘యూపీ, అసోంలలోని బీజేపీ ప్రభుత్వాలు ఏ కారణంగానూ ప్రజలపై కాల్పులకు దిగలేదు. ఇది దిలీప్‌ ఊహల్లో పుట్టిన ఆలోచన కావచ్చు. ఏ కారణంగా చేసినా దిలీప్‌ వ్యాఖ్యలు బాధ్యతరహితమైనవి.’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు దిలీప్‌ వ్యాఖ్యలపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది.  

యూపీలో ‘సీఏఏ’ ప్రారంభం 
లక్నో: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు ప్రక్రియను ఉత్తరప్రదేశ్‌ ప్రారంభించింది. 75 జిల్లాలకు గాను తొలి దశలో 21 జిల్లాల్లోని 32 వేల మంది శరణార్థులను గుర్తించామని మంత్రి శ్రీకాంత్‌ శర్మ తెలిపారు. ఫిలిబిత్‌లో  అత్యధికంగా శరణార్థులున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు