అమిత్‌ షాతో మమత భేటీ.. ఎన్నార్సీపై చర్చ

19 Sep, 2019 14:41 IST|Sakshi

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌లో వీరి సమావేశం జరిగింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ ఇంతకుమునుపు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమైన సంగతి తెలిసిందే. 

అసోంలో జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) అంశంపై అమిత్‌ షాతో సమావేశంలో చర్చించినట్టు ఆమె తెలిపారు. ‘హోంమంత్రితో ఎన్నార్సీ అంశాన్ని ప్రస్తావించాను. ఇందుకు సంబంధించి ఆయనకు ఒక లేఖ ఇచ్చాను. అసోంలో ఎన్నార్సీ జాబితా నుంచి 19 లక్షల మంది పేర్లను తొలగించిన అంశం గురించి ఆయనతో చర్చించాను. ఎన్నార్సీ నుంచి తొలగించిన వారిలో హిందీ, బెంగాళీ, గూర్ఖా ప్రజలు, నిజమైన భారత ఓటర్లు కూడా ఉన్నారు’ అని ఆమె విలేకరులతో తెలిపారు.

బెంగాల్‌లోనూ ఎన్నార్సీని అమలు చేస్తారంటూ వచ్చిన కథనాలు గురించి ప్రశ్నించగా.. ఆమె ఈ వాదనను తోసిపుచ్చారు. అవన్నీ వదంతులేనని, అమిత్‌ షాతో భేటీలో ఈ అంశం గురించి చర్చించలేదని మమత స్పష్టం చేశారు. బెంగాల్‌లో ఎన్నార్సీ అవసరమే లేదని ఆమె తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం కేంద్ర హోంమంత్రిగా అమిత్‌ షా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అమిత్‌ షాతో మమతా బెనర్జీ భేటీ కావడం ఇదే తొలిసారి. అంతకుముందు ప్రధాని మోదీతో సమావేశమైన మమత.. పశ్చిమ బెంగాల్‌ పేరును బంగ్లా మార్చడంతోపాటు పలు అంశాలపై మోదీతో చర్చించారు. 
 

మరిన్ని వార్తలు