కేజ్రీ క్షమాపణల ఎఫెక్ట్‌: ఆప్‌ బాధ్యతలకు బై

16 Mar, 2018 13:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీకి కొత్త సమస్య వచ్చి పడింది. పంజాబ్‌లో ఆ పార్టీ చీఫ్‌ బాధ్యతల నుంచి ఆప్‌ ఎంపీ భగవంత్‌ మన్‌ తప్పుకున్నారు. పార్టీ రాష్ట్ర చీఫ్‌ బాధ్యతకు తాను రాజీనామా చేస్తున్నట్లు భగవంత్‌మన్‌ తన ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శిరోమణి అకాళీ దళ్‌ నేతకు క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్‌ తీసుకున్న నిర్ణయం పంజాబ్‌లోని తమ పార్టీ నేతలకు దిగ్భ్రాంతిని కలిగించిందని, తామంతా ఇబ్బందుల్లో పడతామని కేజ్రీవాల్‌ ఎందుకు ఆలోచించలేకపోయారని వారంతా అనుకున్నట్లు సమాచారం. కేజ్రీవాల్‌ క్షమాపణలు చెప్పడం వారికి షాకిచ్చినట్లయిందని అభిప్రాయపడ్డట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే భగవంత్‌ పార్టీ చీఫ్‌ బాధ్యతలకు రాజీనామా చేశారు. 'నేను పంజాబ్‌ ఆప్‌ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను.. కానీ, మత్తు పదార్థాల మాఫియాకు, పంజాబ్‌లో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా నా పోరాటం మాత్రం ఆగదు' అని మన్‌ ట్వీట్‌లో చెప్పారు. డ్రగ్స్‌ మాఫియాలో శిరోమణి అకాళీదల్‌ నేత బిక్రం సింగ్‌ మజితియా హస్తం ఉందంటూ కొద్ది రోజులకిందట ఆరోపణలు చేసిన కేజ్రీవాల్‌.. తాజాగా ఆయనకు క్షమాపణలు చెప్పారు. తన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, అందుకే తన ఆరోపణలు విరమించుకుంటున్నానని క్షమాపణ లేఖ రాశారు. ఇది పంజాబ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీని షాక్‌ గురిచేసింది.

మరిన్ని వార్తలు