కాంగ్రెస్‌కు షాక్‌... మైసూరు మేయర్‌గా భాగ్యమతి

25 Jan, 2018 10:20 IST|Sakshi

మైసూరు: బుధవారం మైసూరు నగర పాలికెకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది. జేడీఎస్‌–బీజేపీలు ఉమ్మడిగా పనిచేయడంతో మేయర్‌ పీఠం జేడీఎస్‌ వశమయింది. పాలికె మేయర్‌ ఎస్టీకి, డిప్యూటీ మేయర్‌ స్థానాలను ఎస్సీకి కేటాయించారు. జేడీఎస్, బీజేపీల్లో ఎస్టీ మహిళా కార్పొరేటర్లు లేకపోవడాన్ని గుర్తించే సీఎం సిద్ధరామయ్య ఈ మెలికను పెట్టినట్లు సమాచారం. జేడీఎస్‌–బీజేపీ పార్టీలు కాంగ్రెస్‌ కుతంత్రాన్ని ఎలాగైనా తిప్పికొట్టాలనే ఉద్దేశంతో సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించాయి.

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ భాగ్యమతికి ఆ పార్టీ మేయర్‌ పదవి ఇవ్వలేమని మొండిచేయి చూపడంతో ఆమెతో జేడీఎస్‌–బీజేపీలు మంతనాలు జరిపాయి. ఆమె రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. జేడీఎస్‌తో పాటు బీజేపీ పార్టీ సభ్యులు కూడా భాగ్యమతికి మద్దతుగా నిలవడంతో కాంగ్రెస్‌ ఊహించని విధంగా ఆమె మేయర్‌గా ఎన్నికయ్యారు. జేడీఎస్‌కు చెందిన ఇందిరా ఉప మేయర్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు భాగ్యమతిని బుజ్జగించడానికి మంత్రి తన్వీర్‌సేఠ్‌తో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పాలికె కార్యాలయంలోకి ప్రవేశించే మార్గంలో ఆమె కోసం ఎదురు చూడసాగారు. దీంతో ఆమె పాలికె వెనుక వాకిలి నుంచి వచ్చి జేడీఎస్‌–బీజేపీల రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.

మరిన్ని వార్తలు