ఈ రాష్ట్రం  నీ వారసత్వ ఆస్తి కాదు

8 Oct, 2019 03:50 IST|Sakshi

సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని సబ్బండవర్గాలు పోరాటం చేసి సాధించుకున్నాయని, ఇది తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌ గుర్తించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులను తొలగిస్తామంటూ కేసీఆర్‌ అహంభావంతో వ్యవహరిస్తున్నా రని అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాల్లో ఉందనే సాకుతో సంస్థను ప్రైవేటు పాలు చేయాలని కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది ఇప్పుడు వచ్చిన డిమాండ్‌ కాదని, దశాబ్దాల నుంచి ఈ అంశం ఉందన్నారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు పరం చేసేందుకు కేసీఆర్‌ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలుస్తూ తెలంగాణ జాతి సంపద అయిన ఆర్టీసీని నిర్వీర్యం చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా కార్మికులు భయపడవద్దని, వారికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు