-

‘కేసీఆర్ ఒక పొలిటిక‌ల్ టెర్ర‌రిస్ట్‌’

8 Jun, 2019 20:03 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ :  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒ పొలిటిక‌ల్ టెర్రరిస్ట్ లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సీఎల్పీనేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు అన్నారు. కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేల‌ను టీఆర్ఎస్ ఎల్పీలో విలీనంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లి పెట్టు అని అన్నారు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం హైద‌రాబాద్ లోని ఇందిరాపార్క్ వ‌ద్ద‌నున్న ధ‌ర్నా చౌక్ లో ఆయ‌న 36 గంట‌ల నిర‌హారా దీక్ష‌కు కూర్చున్నారు. దీక్ష సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి భట్టి ప్ర‌సంగించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాజ్యాంగాన్ని అవ‌హేళ‌న చేస్తూ రాష్ట్రంలో ప‌రిపాల‌న చేస్తున్నార‌ని మండిపడ్డారు. 

(చదవండి : జనాలు తిరగబడి తన్నే రోజు వస్తుంది’)

ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి, పీసీసీ అధ్య‌క్షుడుకి అందుబాటులోకి రాని స్పీక‌ర్‌.. ఫిరాయించిన శాస‌న‌స‌భ్యుల‌కు మాత్రం  ర‌హ‌స్య ప్రాంతంలో అందుబాటులోకి వ‌చ్చార‌ని భ‌ట్టి ధ్వ‌జ‌మెత్తారు. ఎవ‌రి మీద అయితే డిస్ క్వాలిఫికేష‌న్ పిటీష‌న్ ఇచ్చామో.. వారి నుంచి పిటీష‌న్ తీసుకోవ‌డం ప్ర‌జాస్వామ్యంలో ఎటువంటి సంకేతాల‌ను పంపుతుంద‌ని భ‌ట్టి ప్ర‌శ్నించారు. చ‌ట్ట ప్ర‌కారం న‌డుచుకుందాం, స‌భా నియ‌మాల ప్ర‌కారం ముందుకు పోదాం అన్న ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి స్పీక‌ర్ అందుబాటులోకి రాక‌పోవ‌డం సిగ్గుచేటన్నారు. అందుబాటులోకి రాక‌పోగా.. తన కార్య‌ద‌ర్శి చేత అరెస్ట్ చేయించి.. పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించ‌మ‌ని ఆదేశించ‌డం ఎటువంటి ప్ర‌జాస్వామ్య‌మ‌ని ఆయ‌న అన్నారు. ఇది రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేయ‌డ‌మేన‌ని అన్నారు. 

కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షం అసెంబ్లీలో ఉంటే.. త‌న అవినీతిని లెక్క‌ల‌తో స‌హా బ‌య‌ట‌పెడ‌తార‌ని.. అందుకే సీఎల్పీ లేకుండా చేయాల‌ని కేసీఆర్ కుట్ర‌ప‌న్నార‌ని ఆయ‌న అన్నారు. రీ డిజైనింగ్ పేరుతో గోదావ‌రి న‌దిమీద‌ కేవ‌లం 32 వేల కోట్ల రూపాయ‌ల‌తో పూర్త‌య్యే అన్ని ప్రాజెక్టుల‌ను ల‌క్షా 20 వేల కోట్ల రూపాయ‌ల‌కు పెంచి దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని అన్నారు. అ లెక్కల‌పై కాంగ్రెస్ నాయ‌క‌త్వం చేస్తున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక కేసీఆర్ ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని భ‌ట్టి అన్నారు. ఈ అవినీతి సొమ్ముతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేశార‌ని భట్టి తీవ్రంగా విమ‌ర్శించారు. కేసీఆర్ అవినీతిని లెక్క‌ల‌తో స‌హా లోక్‌పాల్ ముందు పెడుతామని చెప్పారు. రాష్ట్రంలో జ‌రిగిన వంద‌లాది కోట్ల రూపాయ‌ల అవినీతిని బ‌య‌ట‌కు తీస్తూ.. ప్రజా ఉద్యమాలతో ముందుకు వెళ్లి కేసీఆర్‌ను గద్దె దించుతామని భట్టి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు