భూత వైద్యుడిలా మాట్లాడతారేంటి?

15 Mar, 2020 04:40 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న భట్టి. చిత్రంలో  వీరయ్య, రాజగోపాల్‌రెడ్డి

కరోనాపై పిట్ట కథలు చెప్పడం ఆపండి

వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్తే కాంగ్రెస్‌ను కరోనాతో పోలుస్తారా?

అలా అన్నందుకు కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా (కోవిడ్‌–19)పై పిట్ట కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్‌ శాసన సభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క సూచించారు. సీఎం కేసీఆర్‌ ఒక ఆర్‌ఎంపీ డాక్టర్‌లాగా, భూత వైద్యుడిలా మాట్లాడకూడదని, ఇది నిజ జీవితం.. సినిమా కాదని గ్రహించాలన్నారు. కరోనా మన రాష్ట్రానికి రానే రాదని, పారాసిటమాల్‌ మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పే పిట్ట కథలు మానుకోవాలన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, సీతక్క, పొడెం వీరయ్యలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాము అసెంబ్లీలో చెప్పడానికి ప్రయత్నిస్తే.. కాంగ్రెస్‌ పార్టీని సీఎం కేసీఆర్‌ కరోనా వైరస్‌తో పోల్చి మాట్లాడారని, అసలు ఆయనకు బుద్ధుందా అని ప్రశ్నించారు.

సామాజ్య్రవాదులను గడగడలాడించిన కాంగ్రెస్‌ పార్టీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరోనా సోకిన వ్యక్తిని ప్రజా జీవితానికి దూరంగా ఐసోలేషన్‌ రూంలో ఉంచాలని, అలాంటిది నగరం నడిబొడ్డున గాంధీ ఆస్పత్రిలో ఉంచారని విమర్శించారు. నిజ జీవితం సినిమాలా ఉండదని, బాలకృష్ణ సినిమాలో లాగా తొడగొడితే బిల్డింగులు కూలిపోయినట్టు కాదని ఎద్దేవా చేశారు. కరోనా వైరస్‌ తెలంగాణలో రావాలంటే గజ్జున వణుకుతుందని కేసీఆర్‌ చెప్పారని, ఆయన్ను చూసి కరోనా గజ్జున వణికితే డబ్ల్యూహెచ్‌వోకు చెప్పి ప్రపంచ దేశాలు తిప్పుతామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మాటలు చెప్తే సరిపోదని, కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా..: రాజగోపాల్‌రెడ్డి 
సీఎం కేసీఆర్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియాను దేవతతో పోల్చి కాంగ్రెస్‌ పార్టీని పొగిడిన ఆయన ఇప్పుడు వైరస్‌ అంటున్నారన్నారు. ఒడ్డు చేరేంత వరకు ఓడ మల్లయ్య.. ఒడ్డు చేరాక బోడి మల్లయ్యలాగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ వైఖరి చూస్తుంటే ఆ రోజు సోనియాను ఒప్పించి తెలంగాణను ఎందుకు తెచ్చామా అనే బాధ కలుగుతోందని, ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంటే బాగుండేదని అనిపిస్తోందన్నారు. కేసీఆర్‌ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టు ఉందన్నారు. కేసీఆర్‌ తర్వాత కేటీఆర్‌ ఆయన తర్వాత మనుమడు హిమాన్షు సీఎం అని ప్రచారం జరుగుతోందన్నారు.

కేసీఆర్‌ మాటలతోనే ప్రజల్లో అనుమానాలు: సీతక్క 
ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కరోనా లేదు కాకరకాయ లేదు అని మాట్లాడిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు కరోనా గురించి చేస్తున్న హడావుడి చూస్తుంటేనే ఏదో జరిగిపోతోందనే అనుమానం ప్రజలకు కలుగుతోందని వ్యాఖ్యానించారు. కరోనాను నియంత్రించాలని సభలో తాను కోరితే గాలి మాటలు మాట్లాడుతున్నారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా