సైగలతో సస్పెండ్‌ చేశారు..

8 Mar, 2020 03:30 IST|Sakshi
ఫైల్ ఫోటో

కంటిచూపుతో బయటకు వెళ్లగొట్టారు..

పదవిలో కొనసాగే అర్హత కేటీఆర్‌కు లేదు..

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజం

దౌర్జన్యం రాజ్యమేలుతోంది: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. శాంతి భద్రతలు అసలే లేవు. వేలిసైగలు, కంటిచూపుతో సభ నుంచి ప్రతిపక్షాన్ని బయటకు పంపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉరకలు పెడుతోందని ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగంలో చెప్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉరకలు పెడుతోందో అసెంబ్లీ ద్వారా ప్రజలకు చెబుదామనుకుంటే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్‌ చేశారు’అని రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ నుంచి సస్పెం డైన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, పొడెం వీరయ్యతో కలసి ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు.

మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌గా నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన కాంగ్రెస్‌కు చెందిన మునుగోడు పీఏసీఎస్‌ చైర్మన్‌ కుంభం శ్రీనివాస్‌రెడ్డిపై మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దౌర్జన్యం చేశారని భట్టి ఆరోపించారు. 150 మంది గూండాలను పెట్టుకుని శ్రీనివాస్‌రెడ్డి చేతిలో ఐడీ కార్డులు లాక్కుని, అసభ్య పదజాలంతో దూషించి, బట్టలు చించి, పిడిగుద్దులు గుద్ది నామినేషన్‌ వేయకుండా చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని సభలో చెప్పాలని ప్రయత్నిస్తే మైక్‌ ఇవ్వకుండా సస్పెండ్‌ చేశారన్నారు. సభా నాయకుడు సైగలు చేస్తే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి సస్పెన్షన్‌ తీర్మానం ప్రవేశపెట్టారని, ఒక్క సభ్యుడి పేరుతో తీర్మానం ప్రవేశపెట్టి అందరినీ సస్పెండ్‌ చేశారని దుయ్యబట్టారు.

నిజాలు బయటపడతాయనే భయంతోనే..
ప్రతిపక్షం చెప్పే నిజాలు బయటకు వెళ్తే తమ బండారం బయటపడుతుందనే భయంతోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ సభ్యులందరినీ సస్పెండ్‌ చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. మున్సిపల్‌ మంత్రిగా, రెగ్యులటరీ అథారిటీ అధిపతిగా కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌.. జీవో 111కి విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వందల, వేల ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని, విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. కేటీఆర్‌కు మంత్రిగా కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు