‘అంబేద్కర్‌ ఫొటోలను చెక్కించండి’

6 Sep, 2019 18:22 IST|Sakshi
యాదాద్రి దేవాలయ స్థంభాలపై చెక్కిన కారు బొమ్మ

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

సాక్షి, హైదరాబాద్‌: యాదాద్రి దేవాలయ స్థంభాలపై సీఎం కేసీఆర్‌ ఫొటో, కారు గుర్తు ఉండటంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా.. లేక రాజరికమా అని ప్రశ్నించారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చరిత్రను చూపించడం కోసం యాదాద్రిపై కారు బొమ్మను, కేసీఆర్ ఫొటోను చిత్రీకరించారని తెలుస్తోందని, అసలు వీళ్ల చరిత్ర ఏమిటని భట్టి ప్రశ్నించారు. దేవాలయాల్లో ఫొటోలను చెక్కడమే పెద్ద తప్పని విమర్శించారు. దేవాలయం అంటే ఒక పుణ్యక్షేత్రమని, అక్కడికి లక్షలాది మంది వస్తారని పేర్కొన్నారు. అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు వెళ్తారని, అటువంటి ప్రదేశాల్లో రాజకీయాలకు తావు లేకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఒకవేళ అక్కడ ఫోటోలు చెక్కించాలి అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వారివి, భూమి కోసం పోరాటం చేసిన రైతులవి చెక్కించాలని డిమాండ్‌ చేశారు. అంతేగాక భూమిపై హక్కులు కల్పించిన బూర్గుల రామకృష్ణారావు, భూ సంస్కరణలు తీసుకు వచ్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, దేశానికి రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఫొటోలను చెక్కించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలంగాణ వచ్చాక కేవలం బోర్డులపై రాష్ట్రం పేరు మాత్రమే మారిందని, కేసీఆర్‌ కుటుంబం మాత్రం బంగారు కుటుంబంగా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చాక ప్రజల పరిస్థితులు మెరుగవకపోగా.. మరింత అధ్వానంగా తయారవుతున్నాయని విమర్శించారు. మంత్రులు బాధ్యతగా వ్యవహరించి, సంబంధిత శాఖలపై పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. ప్రతి శాఖ మంత్రి పర్యటనలు, సమీక్షలు నిర్వహించాలని సూచించారు. మంత్రులు కేసీఆర్ కుటుంబానికి  తాబేదారుల్లా వ్యవహరించవద్దని ఎద్దేవా చేశారు. (చదవండి: యాదాద్రిపై నీ బొమ్మలెందుకు?)

మరిన్ని వార్తలు