రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అవినీతి

2 Apr, 2018 04:36 IST|Sakshi

     ‘నీరు–చెట్టు’లో రూ.10వేల కోట్లు దిగమింగిన తెలుగు తమ్ముళ్లు

     పీఏసీ చైర్మన్‌ బుగ్గన ఆరోపణ

డోన్‌: రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన నీరు–చెట్టు కార్యక్రమంలో టీడీపీ నేతలు రూ.10వేల కోట్ల ప్రజాధనాన్ని దిగమింగారని ఆరోపించారు. కర్నూలు జిల్లా డోన్‌ మండలంలోని వలిసెల గ్రామంలో వైఎస్సార్‌సీపీ రచ్చబండ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనుల్లో జాబ్‌కార్డులన్నీ అధికారపార్టీ నాయకుల కుటుంబ సభ్యల పేర్ల మీద ఉన్నాయన్నారు.

పనులు చేపట్టకపోయినా రికార్డుల్లో చేసినట్లు చూపి కోట్లాది రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులను తెలుగు తమ్ముళ్లు దిగమింగారని ఆరోపించారు. గృహ నిర్మాణ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని బుగ్గన ధ్వజమెత్తారు. ఒక్కొక్క లబ్ధిదారుని నుంచి టీడీపీ నాయకులు రూ.20వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో వెలుగు చూసిన అవినీతి టీడీపీ నేతల బరితెగింపునకు నిదర్శనమని చెప్పారు.

కందుల కొనుగోలు కేంద్రాల్లో అధికార పార్టీ నాయకులు తిష్టవేసి రైతాంగాన్ని నిలువుదోపిడీ చేశారన్నారు. కర్నూలును ఓడీఎఫ్‌ (బహిరంగ మలమూత్ర రహిత) జిల్లాగా ప్రకటించడం దారుణమని బుగ్గన వ్యాఖ్యానించారు. వలిసెల గ్రామంలో 250 ఇళ్లుంటే ఇప్పటివరకు 80 ఇళ్లకు మరుగుదొడ్లే లేవనే సంగతి అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు