జగన్‌ తిరుమల పర్యటనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం

4 Nov, 2017 14:17 IST|Sakshi

ఖండించిన వైఎస్సార్‌సీపీ నేత భూమన

సాక్షి, తిరుపతి : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నదని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఓ మహిళ చెప్పులేసుకుని జగన్‌ వెంట వెళ్లారని, ఆలయంలో డిక్లరేషన్‌ ఇవ్వలేదని ప్రసారమైన వార్తలను ఆయన ఖండించారు. హిందూ ధార్మిక ఆచారాల పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తిగా జగన్‌ ఎంతో పవిత్రంగా ఆలయాన్ని దర్శించుకున్నారని భూమన తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

వైఎస్‌ కుటుంబాన్ని ఏనాడూ డిక్లరేషన్‌ అడగలేదు : ‘‘పాదయాత్రకు ముందు శ్రీవారి అనుగ్రహం కోసం తిరుమల వచ్చిన వైఎస్‌ జగన్‌పై ఎల్లో మీడియా అసత్యకథనాలను ప్రచారం చేయడం సిగ్గుచేటు. వైఎస్‌ జగన్‌నుకానీ, దివంగత మహానేత వైఎస్సార్‌ను కానీ టీటీడీ ఏనాడూ డిక్లరేషన్‌ అడగలేదు. హైందవ ధర్మాల పట్ల వారికి అపార విశ్వాసం ఉంది’’ అని భూమన పేర్కొన్నారు.

హిందూ ధర్మప్రచార పరిషత్‌గా మార్చిందే వైఎస్సార్‌ : ధర్మప్రచార పరిషత్‌గా ఉన్న సంస్థను హిందూ ధర్మ ప్రచార పరిషత్‌గా మార్చిన ఘనత మహానేత వైఎస్సార్‌దేనని, దళిత గోవిందం, కల్యాణమస్తు లాంటి పవిత్ర కార్యక్రమాలెన్నో ఆయన హయాంలోనే ప్రారంభమయ్యాయని భూమన గుర్తుచేశారు. వేంకటేశ్వరస్వామి అంటే ఎంతో భక్తిభావం కలిగిన జగన్‌ పట్ల ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌ : వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం ఉదయం నైవేద్య సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకులు మండపం చేరుకున్న వైఎస్‌ జగన్‌ను వేద పండితులు ఆశీర్వదించారు. రాష్ట్రప్రజలకు మంచి జరగాలని దేవుణ్ని ప్రార్థించినట్లు జగన్‌ మీడియాకు చెప్పారు. ఆయన వెంట వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, వర ప్రసాద్‌, మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది రెడ్డి, రోజా, చెవిరెడ్డి, డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, నారాయణ స్వామి, శ్రీనివాసులు, చింతల రామచంద్రా రెడ్డి పలువురు పార్టీ  నేతలు ఉన్నారు.

జగన్‌ తిరుమల పర్యటనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది 

>
మరిన్ని వార్తలు