తిరుపతి దశ, దిశ మార్చేస్తాం

6 Mar, 2019 13:27 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సర్వసభ సమావేశంలో మాట్లాడుతున్న ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి

టీటీడీ ఉద్యోగులకు     ఇంటి స్థలాలు

వరాల వర్షం కురిపించిన భూమన కరుణాకరరెడ్డి

తిరుపతి సెంట్రల్‌ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదిస్తే తిరుపతి దశ,దిశ మార్చేస్తామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి భరోసా ఇచ్చారు. తిరుపతి పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాలులో మంగళవారం నిర్వహించిన తిరుపతి నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో భూమన మాట్లాడుతూ ప్రజ లకు వరాల వర్షం కురిపించారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం కాగానే తిరుపతి ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయని ఆయన స్పష్టం చేశారు. టీటీడీ ఉద్యోగులకు న్యాయ పరమైన సవాళ్లతో ప్రమేయం లేకుండానే ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ పాలనలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయించామని, వైఎస్సార్‌ లేకపోవడంతో టీటీడీ ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తాయని గుర్తుకు తెచ్చారు.

తిరుపతిలో టీటీడీతో పాటు యూనివర్సిటీలు, ఆస్పత్రులు, మున్సిపల్‌ కార్పొరేషన్, ఇతర సముదాయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు 30 వేల మందికిపైగా టైమ్‌ స్కేల్‌ వర్తింపజేస్తామని చెప్పారు. పరిశ్రమలతో పాటు ప్రతి సంస్థలో స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చట్టం తీసుకొస్తారని, దీంతో టీటీడీ సహా ఇతర సంస్థల్లో 15 వేల  మందికి తగ్గకుండా ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు. డీకేటీ స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ..మహిళల పేరిట రిజిస్ట్రేషన్లు చేయిస్తామని, దీనివల్ల నియోజక వర్గంలో 35 వేల మందికిపైగా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. తిరుపతిలో 30 వేల ప్రభుత్వ పక్కాగృహాలను నిర్మించి, అర్హులందరికీ ఉచితంగా మంజూరు చేస్తామని భూమన హామీ ఇచ్చారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అనేక ప్రాంతాల్లో స్థలాలపై రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని...తాము అధికారంలోకి రాగానే అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తామని కరుణాకర రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ ప్రకటించిన సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. నగర ప్రజలకు 24 గంటలూ నీటిని సరఫరా చేయిస్తామన్నారు. కాలువలు, డ్రైన్లను ఆధునీకరిస్తామని తెలిపారు. తిరుపతిని అభివృద్ది బాట పట్టిస్తామని భూమన హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక నగరంలో సుపరిపాలన సాధిద్దామని, ఆశ్లీల నగరంగా మారకుండా పరిరక్షించుకోవాలని కరుణాకర రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు