పెట్రో ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి

30 Jun, 2020 05:58 IST|Sakshi

రాష్ట్రపతికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై 20 రోజులుగా  పెట్రోల్‌ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మరింత భారాన్ని మోపుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.నియంతలా పాలిస్తున్న మోదీ ప్రభుత్వం సామాన్యుల గోడు పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని, దేశంలో పెట్రో ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిందుకు సోమవారం ఆయన లేఖ రాశారు.‘ కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  ఉపాధి లేక వలస కార్మికులు ,పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.  

ఇంత దుర్భర జీవితాన్ని ఎదుర్కొంటున్న సమయంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే విచిత్రంగా మనదేశంలో పెట్రోల్‌ ,డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 2014లో క్రూడాయిల్‌ ధర 108 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్‌ ధర లీటర్‌ రూ 71.40 డీజిల్‌ రూ. 59.59 ఉంది. 2020 లో క్రూడాయిల్‌ ధర 43.41 డాలర్లకు  అంటే సుమారు 60 శాతం తగ్గితే పెట్రోల్‌ లీటర్‌ కి రూ 20.68 ఉండాలి కానీ రూ 82.96 ఉంది. మోదీ ప్రభుత్వం ఒక నియంతలాగ పాలిస్తోంది. ఇష్టానుసారంగా ఎక్సైజ్‌ డ్యూటీ పెంచుతోంది. గత ఆరేళ్లుగా ఈ రూపంలో సుమారు రూ. 18 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని, వారిశ్రమను చార్జీల రూపంలో లాగేసింది. వెంటనే జోక్యం చేసుకుని ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోండి.’ అని ఆ లేఖలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.  
 

మరిన్ని వార్తలు