ఏపీ రాజధానిపై మహాకుట్ర!

27 Aug, 2019 13:10 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ రాజధానిపై మహాకుట్ర జరుగుతుంది. కుట్రకు సంబంధించిన కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ అంతా కరకట్ట నుంచే అందుతోంది. పక్కా ప్లాన్‌ ప్రకారమే టీడీపీ నేతలు అన్ని పార్టీలను కలుస్తూ..రాజధానిపై రాజకీయం చేస్తున్నారు. గుడ్డ కాల్చి ప్రభుత్వంపై వెయ్యడానికి చకచకా పావులు కదుపుతున్నారు. రాజధానిపై చంద్రబాబు చేస్తున్న కుట్రపై సాక్షిటీవీ ప్రత్యేక కథనం..

రాజధాని పేరుతో రైతులనుండి 33వేల ఎకరాలు లాక్కున్న చంద్రబాబు సర్కారు నాలుగున్నరేళ్లలో వారికి చేసిందేమీ లేదు. డజనుకు పైగా దేశాలు తిరుగుతూ జనం సొమ్మును దుబారా చేసిన చంద్రబాబు..ఏ దేశం వెళితే అలాంటి రాజధాని కడతానంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప రాజధానిలో ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాత్రం రాజధాని పేరుతో లూటీ చేసిన మాట మాత్రం వాస్తవం.

రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు డజనుకుపైగా హామీలిచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం..అందులో ఒక్క హామీ కూడా అమలు చెయ్యలేదు. అభివృద్ది చేసి ఇస్తామన్న ప్లాట్లు ఎక్కడున్నాయో రైతులకే తెలియదు. ఇక రాజధాని పేరుతో ఇన్ సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడుతూ చంద్రబాబు, ఆయన బినామీలు వందల కోట్ల ఆస్తులు వెనకేసుకున్నారు. చంద్రబాబు తనకు నచ్చిన కంపెనీలకు తక్కువ ధరలకే భూములు కట్టబెట్టి భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక స్థానిక టీడీపీ నేతలు 29 గ్రామాల్లో గజం భూమిని కూడా వదల్లేదు. చెరువులు, కాలువలు, వాగులు, వంకలు, మిగులు భూములు, సీలింగ్ ల్యాండ్, ఎసైన్డ్ ల్యాండ్ ఇలా దేన్నీ వదలకుండా దోచేశారు.

రాజధాని  ప్రాంతం ముంపు పరిధిలో ఉంది కృష్ణానది ఉప్పొంగితే ఏం జరుగుతుందో తాజాగా వచ్చిన వరదలు కళ్లకు కట్టాయి. ఈ విషయాన్ని శివరామకృష్ణ కమిటీ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. కుట్రలో భాగంగా టీడీపీ నాయకులతో పాటు వారికి వంతపాడే ఎల్లో మీడియా రాజధాని దొనకొండకు తరలిపోతుందంటూ రచ్చ చేస్తున్నారు. అయితే ఇదంతా పక్కాప్లాన్ ప్రకారమే జరుగుతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.

తన అనుకూల పత్రికల్లో రాయించడంతో పాటు తమ నాయకులతో రాజధాని తరలిపోతుందని గగ్గోలు పెట్టించిన చంద్రబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. మొన్నటివరకూ రాజధాని గ్రామాల్లో టీడీపీ నాయకులుగా ఉంటూ కోట్లు సంపాదించిన వారందరినీ ఇప్పుడు పావులుగా ఉపయోగించుకుంటున్నారు. చంద్రబాబు ప్లాన్ ప్రకారం వీరంతా రాజధాని రైతుల పేరుతో అన్ని రాజకీయ పార్టీల నేతలను కలవడం, తమకు మద్దతివ్వాలని కోరడం జరుగుతుంది. చంద్రబాబు ప్లాన్ లో భాగంగానే తుళ్లూరు మండలానికి సంబందించిన దాదాపు డజను మంది టీడీపీ నేతలు కొంతమంది టీడీపీ కార్యకర్తలతో ఏపీ బీజేపీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసి రాజధానిని తరలించేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలబడాలని కోరారు. బీజేపీ నేత కన్నా చుట్టూ ఉన్న అనుచరులు మాత్రం నిన్నటివరకూ కన్నాను తిట్టి ఇప్పుడు తమ సమస్యలకు అండగా నిలబడాలంటూ కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కన్నా లక్ష్మీనారాయణను కలవడంతో ఆగని చంద్రబాబు బ్యాచ్ ఆ వెంటనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిసింది. రాజధానిని తరలించేస్తున్నారు.. తమకు అండగా నిలబడాలంటూ సేమ్ డైలాగ్ రిపీట్ చేశారు. దీన్ని చూసి జనసేనకార్యకర్తలు మండిపడుతున్నారు. మూడేళ్లక్రితం రాజధాని ప్రాంతంలో పవన్‌కల్యాణ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఈ బ్యాచ్‌..ఇప్పుడు అదే పవన్‌ కల్యాణ్‌ను కలిసి మద్దతు కోరడంపై జనసేనలో చర్చ జరుగుతుంది. ఇక ఇదే టీం బీజేపీ నేత సుజనా చౌదరిని కూడా కలిసింది. అయితే వీరంతా పాత మిత్రులే కావడంతో ఎవరూ ఈ మీటింగ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు.చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఈ గ్రూపు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కలుస్తుండడంపై పెద్ద కుట్ర జరుగుతుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండిపడుతుంది. రాజధాని తరలింపుపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చెయ్యకపోయినా జనంలో గందరగోళం సృష్టించి రాజకీయ లబ్ది పొందడానికి చంద్రబాబు అండ్ టీం చేస్తున్న ఈ కుట్రను ప్రజలు అర్దం చేసుకోవాలని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు