బీజేపీకి షాకివ్వనున్న మిత్రపక్షాలు!

9 Nov, 2018 10:45 IST|Sakshi
నితీష్‌-అమిత్‌ షా (ఫైల్‌ ఫోటో)

బీజేపీ, జేడీయూ సీట్ల ఒప్పందంపై మిత్రపక్షాల అసంతృప్తి

పట్నా : లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో విపక్షాలన్నీ కూటమి కట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. బీజేపీకి మాత్రం మిత్రపక్షాల పోరు తలనొప్పిగా మారింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారిన బిహార్‌లో బీజేపీ-జేడీయూ సీట్ల పంపకం ఇతర పార్టీలకు మింగుడు పడడంలేదు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 40 స్థానాల్లో బీజేపీ,జేడీయూ కలిసి 34 స్థానాల్లో పోటీచేసి మిగిలిన సీట్లను మిత్రపక్షాలకు కేటాయించాలని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన రాంవిలాస్‌ పాశ్వాన్‌ పార్టీ లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ), రాష్ట్రీయ లోక్‌జనశక్తి (ఆర్‌ఎల్‌జేపీ)లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో తాము గెలిచిన అన్నీ స్థానాల్లో తిరిగిపోటీ చేస్తామని, సిట్టింగ్‌ స్థానాలకు వదులుకునే ప్రసక్తే లేదని ఇరుపార్టీలు తేల్చిచెప్పాయి.

సీట్ల పంపకంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ మధ్య చర్చలను తాము ఏకభవించడంలేదని, బీజేపీ-జేడీయూ ఇరవై స్థానాల్లో పోటీ చేసి మిగిలిన సీట్లను తమకు కేటాయించాలని ఎల్‌జేపీ నేత, రాష్ట్ర మంత్రి పసుపతి డిమాండ్‌ చేశారు. దీంతో బిహార్‌లో రాజకీయం తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా గత ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసి 22 సీట్లు గెలుపొందగా, ఎల్‌జేపీ ఆరు, ఆర్‌ఎల్‌జేపీ మూడు స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆర్జేడీతో కలిసి బరిలోకి దిగిన జేడీయూ కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. కాగా బీజేపీతో పొత్తు కుదరని పక్షంలో తాము ఒంటరిగానైనా పోటీకి దిగుతామని ఇటీవల ఎల్‌జేపీ నేతఒకరు ప్రకటించారు.


 

>
మరిన్ని వార్తలు