త్రిపుర సీఎంగా విప్లవ్‌ ప్రమాణం

10 Mar, 2018 02:40 IST|Sakshi
ప్రమాణ స్వీకార వేదికపై విప్లవ్‌తో మోదీ, అమిత్‌ షా

తొలిసారి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం

అగర్తలా: సుమారు పాతికేళ్ల కమ్యూనిస్టుల పాలన అనంతరం త్రిపురలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన సీఎంగా విప్లవ్‌  కుమార్‌ దేవ్‌(48) శుక్రవారం ప్రమాణం చేశారు. అగర్తలాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తథాగతరాయ్‌ విప్లవ్‌తో సీఎంగా ప్రమాణంచేయించారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ , కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ నాయకులు అడ్వాణీ, ఎంఎం జోషి, తాజా మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విప్లవ్‌తో పాటు బీజేపీకే చెందిన జిష్ణు దేవ్‌ వర్మన్‌ ఉప ముఖ్యమంత్రిగా, మరో ఏడుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ సీఎంలు రూపానీ(గుజరాత్‌), శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌(మధ్యప్రదేశ్‌), సర్బానంద సోనోవాల్‌(అసోం), రఘువర్‌ దాస్‌(జార్ఖండ్‌)లూ కార్యక్రమంలో పాల్గొన్నారు.

త్రిపురకు పూర్తి మద్దతు: మోదీ
త్రిపుర సమగ్రాభివృద్ధి కోసం కొత్త ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా మద్దతిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. విప్లవ్‌ ప్రమాణ స్వీకారం చేశాక మోదీ ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి అవకాశాలు అపారంగా ఉన్నాయని, వాటిని వెతికిపట్టుకోవాలని పిలుపునిచ్చారు. ‘ త్రిపుర  ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి. ప్రతి భారతీయుడు ఈశాన్య వాసులకు అండగా ఉంటాడు’ అని అన్నారు.

ఆరెస్సెస్‌ నుంచి మరో సీఎం..
విప్లవ్‌ రాజకీయ ప్రస్థానం ఆరెస్సెస్‌తో∙మొదలైంది. గోమతి జిల్లా రాజ్‌ధార్‌ నగర్‌ గ్రామంలోని మధ్య తరగతి కుటుంబంలో 1971, నవంబర్‌ 25న విప్లవ్‌ జన్మించారు. ఆయన తండ్రి జనసంఘ్‌లో పనిచేశారు.  డిగ్రీ పూర్తిచేసిన విప్లవ్‌ ఆరెస్సెస్‌లో చేరి సుమారు 16 ఏళ్లు సేవలందించారు.  
 

మరిన్ని వార్తలు