నిన్నెలా నమ్మాలి లోకేశ్‌?

10 Apr, 2019 08:36 IST|Sakshi
తాడేపల్లిలో నిర్వహించిన ప్రచారంలో లోకేశ్‌ను నిలదీస్తున్న మహిళలు (ఫైల్‌)

అయిదేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేశారు

బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రయత్నించారు

కొండమీద ఉన్న ఇళ్లను తొలగించాలని నోటీసులు జారీ చేశారు

ఎన్నికల ప్రచారంలో లోకేశ్‌ను ఎక్కడికక్కడ నిలదీస్తున్న ప్రజలు

ఓటుతో బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్న రైతులు, ఓటర్లు

సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకేశ్‌కు అడుగడుగునా నిలదీతలు, సొంత పార్టీ నేతల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భూములు ఇవ్వని రైతులను వేధించడంతో రైతులంతా ఇప్పుడు ఎదురుతిరుగుతున్నారు. స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకుంటామని చెప్పి బలవంతంగా భూసేకరణ నోటిఫికేషన్‌ ఇవ్వడంతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని 10 గ్రామాల రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. భూములు కాపాడుకునేందుకు కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారని, ఐదేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేశారని గుర్తు చేసుకుంటున్నారు. ఈ 10 గ్రామాల్లో భూములు ఇవ్వని రైతులు, వారి కుటుంబ సభ్యులు కలిపి సుమారు 15 వేల నుంచి 20 వేల వరకు ఉన్నారు. వీరంతా ఇప్పుడు లోకేశ్‌ను ఓడించేందుకు సిద్ధమయ్యారు.

కొండ మీద ఇళ్లు తొలగించాలని నోటీసులు 
పర్యాటకాభివృద్ధి పేరుతో తాడేపల్లి మండలంలో కొండల మీద ఉన్న సుమారు 4 వేల ఇళ్లను తొలగించాలని ఇదివరకే అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులతో కొంతమంది కోర్టులను కూడా ఆశ్రయించారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఈ ఇళ్లను తొలగిస్తారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. దీంతో వీరంతా టీడీపీకి బుద్ధి చెప్పేందుకు సన్నద్ధమయ్యారు.

గతంలోనూ చాలా హామీలు ఇచ్చారు! 
గత ఎన్నికలకు ముందు కూడా అధికారంలోకి రావడానికి టీడీపీ అనేక హామీలు ఇచ్చిందని.. అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కిందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఎన్నికల్లో గెలిచేందుకు భారీగా హామీలు ఇస్తున్నారని.. అయితే ఎన్నికలు అయిపోగానే తమ పని తాము చేసుకుపోయేందుకు టీడీపీ నాయకులు ఏ మాత్రం వెనుకాడరని భావిస్తున్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఇళ్లు తొలగించిన వారికి ఇళ్లు ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.

ప్రశాంతంగా జీవించాలంటే లోకేశ్‌కు బై బై చెప్పాలి..! 
నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంతంగా జీవించాలంటే లోకేశ్‌కు ‘బై బై’ చెప్పాలనే నినాదం జోరుగా వినిపిస్తోంది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే సంప్రదాయం టీడీపీకి లేదని గుర్తు చేస్తున్నారు. అలాగే కుంచనపల్లిలో 171 ఎకరాలను రిజర్వ్‌ జోన్‌లో ఉంచి తమ పార్టీ నాయకులకు మేలు చేకూర్చిన విషయాలను వారు చర్చించుకుంటున్నారు. ఇక్కడ లోకేశ్‌ను గెలిపిస్తే భూములు బలవంతంగా లాక్కుంటారని.. మంగళగిరిని కబ్జాలకు అడ్డాగా మార్చుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

‘‘అయిదేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భూములివ్వని రైతులను వేధించారు. భూసేకరణ కింద భూములు కాజేసేందుకు తీవ్రంగా యత్నించారు. మా భూములు కాపాడుకునేందుకు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చి ఓట్లు ఎలా అడుగుతున్నారు.?’’ – గుంటూరు జిల్లా ఉండవల్లిలో ప్రచారానికి వచ్చిన లోకేశ్‌ను నిలదీసిన మహిళా రైతు

‘‘ 2015 కృష్ణా పుష్కరాల సమయంలో ఇళ్లను తొలగించారు. నాలుగేళ్లవుతున్నా స్థలాలు చూపించలేదు. ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు. తాడేపల్లి, ఉండవల్లిలో కొండ మీద ఉన్న ఇళ్లను తొలగించాలని నోటీసులిచ్చారు. ఈ అయిదేళ్లలో ఒక్కసారైనా మా బాధలు విన్నారా? ఇప్పుడు ఎన్నికలు రాగానే మేము కనిపించామా?’’ – ఇవీ తాడేపల్లిలో లోకేశ్‌ నిర్వహించిన ప్రచారంలో స్థానికుల నుంచి ఎదురైన ప్రశ్నలు

మరిన్ని వార్తలు